Begin typing your search above and press return to search.

'మహా' వడబోతకు గులాబీ సారు భారీ ప్లానింగ్

By:  Tupaki Desk   |   18 May 2022 5:28 AM GMT
మహా వడబోతకు గులాబీ సారు భారీ ప్లానింగ్
X
ఎన్నికల వేళ ఎన్నికలు. మిగిలిన వేళ మాత్రం పాలన మీద మాత్రమే ఫోకస్ అంటూ చాలామంది పాలకులు చెబుతుంటారు. కానీ.. వారి మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదు. దేశ రాజకీయాల్ని చూసినప్పుడు జాతీయ స్థాయిలో కానీ.. రాష్ట్ర స్థాయిలో కానీ ప్రభుత్వాధినేతలు వ్యవహరిస్తున్న తీరులో చాలానే మార్పు వచ్చింది. కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల పాలకులు కొత్త తరహాను ప్రదర్శిస్తున్నారు. విధేయ అధికారులకు పెద్ద పీట వేయటం.. రూల్ ఫర్ వర్కు మాదిరి వ్యవహరించే వారి విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. ఇక.. తమకు మాత్రమే విధేయత ప్రదర్శించే కొందరు అధికారులకు పెద్ద పీట వేస్తూ వారిని ఇస్పెషల్ గా చూసే ధోరణి ఎక్కువైంది.

మైకు దొరికిన ప్రతిసారీ రాజనీతి గురించి.. ఆదర్శాల గురించి నీతులు చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. చేతల్లో ఎలా చేస్తారన్న విషయం తెలిసిందే. ఆయన వల్లించే వాదనలకు భిన్నంగా ఆయన పాలన ఉంటుంది. మామూలు సమయాల్లోనే ఇలా ఉంటే.. కీలకమైన ఎన్నికలకు ముందు ఆయన తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా 2018లో ముందస్తు (సాంకేతికంగా మాత్రం అలా వ్యవహరించకూడదనుకోండి) ఎన్నికలకు ముందు భారీగా ఐఏఎస్ లను బదిలీ చేయటం తెలిసిందే.

దగ్గర దగ్గర యాభై మంది అధికారుల్ని బదిలీ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా రెండు వారాలకు పైనే ఫాం హౌస్ అనబడే ఫార్మర్ హౌస్ లో కూర్చొని.. పెద్ద ఎత్తున కసరత్తు చేసిన సీఎం కేసీఆర్.. తమకు అనుకూలమైన ఐఏఎస్ లు ఎవరు? ఇతరుల పట్ల ఆసక్తిని చూపే వారు ఎవరు? అన్న అంశాన్ని తేల్చే విషయంపై పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లుగా చెబుతున్నారు.

ఎందుకు ఇదంతా అంటే.. షెడ్యూల్ కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో సక్సెస్ అయిన ఫార్ములాకు మారిన కాలానికి తగ్గట్లు కొన్నిమార్పు చేసి అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ లు ఎవరు? అన్న దానిపై మహా వడబోతను చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం కోసం నిఘా వర్గాలు ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

విశ్వాస పాత్రులు.. నమ్మినబంట్లు.. వినయ విధేయ రామలతు.. సర్కారుకు సన్నిహితంగా వ్యవహరించే వారికి రానున్న రోజుల్లో మరింత మంచి పోస్టింగులు ఇవ్వటం ద్వారా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.ఈ వాదనలోనిజం ఎంత?

అన్నది చూస్తే.. రానున్న రోజుల్లో భారీగా బదిలీలు జరిగితే మాత్రం.. అది జరిగిన కొద్ది కాలానికే ఎన్నికలకు వెళ్లే వీలుంటుందని చెబుతున్నారు. ఈ లోపు అన్ని సిస్టమేటిక్ గా మార్పులుచేసిన తర్వాతే.. ఆయన ఎన్నికలకు వెళతారని చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజం ఏమిటన్నది తేలాలంటే మాత్రం.. కాసింత వెయిట్ చేయాల్సిందే. అప్పుడే సారు లెక్కలు స్పష్టమవుతాయన్న మాట వినిపిస్తోంది.