Begin typing your search above and press return to search.

కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో సీటు కోసం వైసీపీలో మూడు ముక్క‌లాట‌!

By:  Tupaki Desk   |   6 Sep 2022 12:30 AM GMT
కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో సీటు కోసం వైసీపీలో మూడు ముక్క‌లాట‌!
X
ఏపీలో అన్ని పార్టీల‌కు కీల‌క‌మైన జిల్లాల్లో గుంటూరు ఒక‌టి. తూర్పు గోదావ‌రి జిల్లా (19) త‌ర్వాత అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు 17 ఉన్న జిల్లా గుంటూరు కావ‌డమే ఇందుకు కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో రేప‌ల్లె, గుంటూరు ప‌శ్చిమ మిన‌హాయించి మిగిలిన 15 చోట్ల వైఎస్సార్సీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైఎస్సార్సీపీ ఇదే ఊపును కొన‌సాగించాల‌నుకుంటోంది.

అయితే గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్నాయ‌ని అంట‌గున్నారు. అన్ని ప్రధాన పార్టీల త‌ర‌ఫున గుంటూరు తూర్పు నుంచి ముస్లిం అభ్య‌ర్థులే బ‌రిలోకి దిగుతున్నారు. ముస్లింల ఓట్లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా 65 వేల వ‌ర‌కు ఉన్నాయి. గ‌త రెండు ప‌ర్యాయాలు 2014, 2019లో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి షేక్ ముస్త‌ఫా ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు.

అయితే ఈసారి ఆయ‌న‌కు గుంటూరు డిప్యూటీ మేయ‌ర్ షేక్ స‌జిల రూపంలో గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంద‌ని చెబుతున్నారు. షేక్ స‌జిల మ‌హిళ కావ‌డం, ముస్లిం మ‌హిళ కోటా, ప్ర‌జ‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండటం వంటి కార‌ణాల‌తో స‌జిల వైపు వైఎస్సార్సీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మొగ్గుచూపుతున్నార‌ని చెబుతున్నారు. ఇక టీడీపీ ఇన్‌చార్జ్‌గా న‌జీర్ అహ్మ‌ద్ ఉన్నారు. జ‌న‌సేన పార్టీ కూడా ఇక్క‌డ బ‌లంగానే ఉంది. ఆ పార్టీకి గ‌త ఎన్నిక‌ల్లో 22 వేల ఓట్లు వ‌చ్చాయి. జియావుర్ రెహ్మాన్ రూపంలో గ‌ట్టి నేత జ‌న‌సేన పార్టీకి ఉన్నారు.

ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్త‌ఫాకు, డిప్యూటీ మేయ‌ర్ షేక్ స‌జిల‌కు విభేదాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇటీవ‌ల గుంటూరు నెహ్రూ‌నగర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం సంద‌ర్బంగానూ ఈ విభేదాలు పొడ‌సూపాయ‌ని చెబుతున్నారు. నగర డిప్యూటీ మేయర్ పట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముస్త‌ఫా అగౌరవంగా ప్రవర్తించిన‌ట్టు స‌మాచారం. తనకు పోటీగా వస్తున్నావని డిప్యూటీ మేయర్ సజిలాపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన‌ట్టు చెబుతున్నారు. తనను కాదని ముందుకు ఎలా వస్తావో చూస్తాన‌ని ఆగ్రహం వ్యక్తం చేశార‌ని అంటున్నారు. తనను కాదని నియోజకవర్గంలో ఏం చేయలేవని హెచ్చరించార‌ట‌.

కాగా షేక్ స‌జిల మాజీ కార్పొరేట‌ర్ షేక్ షౌక‌త్ కూతురు. షేక్ షౌక‌త్ గుంటూరు తూర్పు నుంచి 2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున పోటీ చేశారు. అంతేకాకుండా రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్య‌ర్థి కంటే అధికంగా ఓట్లు సాధించారు. అయితే కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌స్తాన్‌వ‌లి విజ‌యం సాధించారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా పార్టీలో చురుగ్గా ఉన్నా ఆయన కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువగా ఉందనే విమర్శలున్నాయి. అదే విధంగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వటంతో ఆయనపై సహజంగానే కొంత వ్యతిరేకత కూడా ఉంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ కారణాలు చూపిస్తూ..ఈసారి తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సజిలా వైఎస్సార్సీపీ అధిష్టానాన్ని కోరుతున్నార‌ట‌. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే ముస్తఫా కూడా త‌న‌కు టికెట్ ఇవ్వ‌ని ప‌క్షంలో త‌న కుమార్తె ఫాతిమాకు టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ట‌. మ‌రి వైఎస్సార్సీపీ అధిష్టానం ఎవ‌రికి టికెట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.