Begin typing your search above and press return to search.

టీ టీడీపీ : రామయ్య పార్టీకి బీమానే ధీమా ? రావయ్యా చంద్రయ్యా !

By:  Tupaki Desk   |   18 April 2022 4:28 AM GMT
టీ టీడీపీ : రామయ్య పార్టీకి బీమానే ధీమా ? రావయ్యా చంద్రయ్యా !
X
ఒక‌నాడు వెలుగుల చంద్రుడు.. వెలుగులీనే రాముడు.. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు తెలంగాణ వాకిట ఒక‌రు నిగ్ర‌హ రూపాన మ‌రొక‌రు విగ్ర‌హ రూపాన మిగిలిపోయారు.. మా రాజులే వెళ్లిపోయారు అని చెప్పిన విధంగా తెలంగాణ లోగిళ్ల‌లో ప‌సుపు పార్టీ జ్ఞాప‌కాలే ఉన్నాయి కానీ ఆన‌వాళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉనికే లేదు కానీ ఊపిరి పోస్తాను అని అంటున్నారు చంద్ర‌బాబు. ఆ విధంగా ఆయ‌న మ‌ళ్లీ కేసీఆర్ పార్టీకి పోటీగా వెళ్లాల్సిందేన‌ని చెప్ప‌డం ఓ విధంగా ఆశ్చ‌ర్య‌క‌రం. న‌డిపించే నాయ‌కులు లేక ఆ కొర‌త‌తోనే పార్టీ మ‌రుగున ప‌డిపోయింది.

ఆ రోజు బాబు ద‌గ్గ‌ర ఉన్న నేత‌లు ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర స‌మితిలో స్థిరం అయి ఉన్నారు. ఇక వాళ్లు ఇటు రారు. అలా అని పార్టీని ఇక్క‌డ క్లోజ్ చేయడం సంభవం కాదు. క‌నుక పార్టీని ఉన్నంత‌లో మెరుగ్గా రూపుదిద్దుకునేలా చేయ‌డ‌మే ఇప్ప‌టి త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం బాబుకు మ‌రియు ఇంకొంద‌రికి కూడా ! లేదంటే న‌వ్వుల పాలు అవుతామ‌న్న భ‌యం కూడా ఉంది కొంద‌రిలో! ఆ రోజు తార‌క రాముడి చెంత ఉన్న వారు ఎక్క‌డెక్క‌డో ఉన్నారు. గండిపేట కేంద్రంగా రాజ‌కీయ పాఠాలు నేర్చుకున్న వారు ఎక్క‌డెక్క‌డో ఉన్నారు. వారిప్పుడు ఇటు రారు మ‌రియు రాలేరు కూడా! పోనీ రామారావు త‌రువాత వ‌చ్చిన అల్లుడు బాబు ద‌గ్గ‌ర అయినా నాలుగు సూత్రాలు నేర్చుకున్న వారు కూడా ఇప్పుడు రారు మ‌రియు రాలేరు కూడా ! ఈ ద‌శ‌లో మెంబ‌ర్ షిప్ డ్రైవ్ ను కండెక్ట్ చేయ‌డం సుల‌భ‌మేనా?

తెలంగాణ‌లో టీడీపీ లేదు. తెలంగాణ‌లో ప‌సుపు పార్టీ చెప్పే ఏ మాట కూడా పెద్ద‌గా ఉనికిలో లేదు. ఆ విధంగా తెలంగాణ వాకిట చంద్రుడికి గ్ర‌హణాలే మిగిలాయి అన్న విమ‌ర్శ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్న వైనం పై ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ల్లాగుల్లాలు ప‌డుతూనే ఉన్నారు సంబంధిత నాయ‌కులు. పార్టీ నుంచి రేవంత్ వెళ్లిపోయారు. అదేవిధంగా మ‌రో నేత నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు మోసిన ఎల్‌.ర‌మ‌ణ అనే బీసీ నేత కూడా వెళ్లిపోయారు.

అసలు క్యాడ‌రే లేని పార్టీలో మ‌ళ్లీ మునుపుటిలా ప‌నిచేయాల‌ని చెప్ప‌డం వెనుక చంద్ర‌బాబు అంత‌రార్థం ఏంట‌న్న‌ది అర్థం కావ‌డం లేదు అన్న‌ది ప‌రిశీల‌కుల మాట. ఓ విధంగా కాంగ్రెస్ కూడా ఇదేవిధంగా ఇంతే సంగ‌తులు చిత్త‌గించ వ‌లెను అన్న విధంగానే ఉంది. కానీ అక్క‌డ చెప్పుకోద‌గ్గ లీడ‌ర్లు, మ‌రీ ముఖ్యంగా కొట్లాట ప‌డి అయినా త‌మ విధేయ‌త‌ను చాటుకునే లీడ‌ర్లు ఉన్నారు. కానీ ఇక్క‌డ అలా లేరు. అంత సీన్ కూడా ఇవాళ టీటీడీపీకి లేదు.

ఇక నిన్న‌టి వేళ చంద్ర‌బాబు హ‌ఠాత్తుగా టీటీడీపీ నేత‌ల‌తో భేటీ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రిగిన బృహతి (ఈనాడు సంస్థ‌ల అధినేత్రి, రామోజీ మ‌న‌వ‌రాలు) పెళ్లికి వెళ్లే ముందు జ‌రిగిన ప‌రిణామాలు భలే ఆస‌క్తిని నెల‌కొల్పాయి మ‌రియి ప్రోది చేశాయి. చంద్ర‌బాబు చెబుతున్న విధంగా మంచో, చెడో ఆయ‌న చేసిన అభివృద్ధికి త‌రువాత వ‌చ్చిన సీఎంలు (వైఎస్‌, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ) కొన‌సాగింపు ఇచ్చారు. కానీ ఆంధ్రా లో ఆ త‌ర‌హా ఆలోచ‌న లేదు అని విస్తుబోయ‌రు చంద్ర‌బాబు.

ఇదే సంద‌ర్భాన ఈ నెల 25 నుంచి మెంబ‌ర్ షిప్ డ్రైవ్ చేయాల‌ని, వంద రూపాయ‌లు చెల్లిస్తే కార్య‌క‌ర్త‌గా స‌భ్య‌త్వం పొంద‌వ‌చ్చు అని, అదేవిధంగా స‌భ్య‌త్వం పొందిన వారికి రెండు ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా వ‌ర్తింప‌జేస్తామ‌ని కూడా చెప్పారు. ఇవ‌న్నీ బాగానే ఉన్నా బీమా మాట చెప్పినంత మాత్రాన పార్టీకి స‌భ్య‌త్వాలు పెరిగిపోతాయా? ఆ మాట‌కు వ‌స్తే ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చి పంపుతున్నారు ప‌వ‌న్ త‌న కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు...ఇది కూడా బీమానే ! కానీ ఆయ‌న దానిని ప్ర‌చారం చేయ‌మ‌ని చెప్ప‌డం లేదు. కానీ చంద్ర‌బాబు మాత్రం బీమా మంత్రాన్ని అదే ప‌నిగా పఠించి, ప్రచారం చేసి త‌ద్వారా పార్టీ స‌భ్య‌త్వాలు పెంచాల‌ని చెప్ప‌డం ఓ విధంగా విస్మ‌య‌కారకం.