Begin typing your search above and press return to search.

విశాఖ వేసవి రాజధాని... కర్నూల్ లో వింటర్ సెషన్...?

By:  Tupaki Desk   |   14 Sep 2022 9:40 AM GMT
విశాఖ వేసవి రాజధాని... కర్నూల్ లో వింటర్ సెషన్...?
X
మనసుంటే మార్గాలు అని అంటారు. ఇపుడు అమరావతి రాజధాని సమస్య చాలా క్లిష్టంగా మారుతోంది. నిజానికి ఇందులో అతి పెద్ద రాజకీయం దాగుంది. అమరావతిని వన్ అండ్ ఓన్లీగా చేస్తే టీడీపీని దగ్గరుండి వైసీపీ గెలిపించినట్లే. ఆ పార్టీ అపర సృష్టికి జై కొట్టినట్లే. అందుకే మూడు రాజధానులు అంటూ తనదైన బ్రెయిన్ చైల్డ్ ని జగన్ బయటకు తీశారు. అయితే ఇది వర్కౌట్ కాని విషయం అని తేలిపోతోంది

న్యాయపరంగా చూస్తే ఇప్పటికే వీగిపోయింది. ఇప్పటికే హై కోర్టు తన తుది తీర్పు వెలువరించింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని పేర్కొంది. దాంతో ప్రభుత్వానికి ఏమీ తోచని పరిస్థితి. అయితే ప్రైమ్ క్యాపిటల్ గా అమరావతినే ఉంచుతూ ప్రభుత్వం కొంత సర్దుబాటు చేసుకోవచ్చు అని అంటున్నారు. అలా కనుక చేస్తే అమరావతి రాజధాని సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.

అదే టైం లో విశాఖను వేసవి రాజధానిగా చేస్తూ కర్నూల్ లో వింటర్ సెషన్ ని కనుక నిర్వహిస్తే మూడు ప్రాంతాలకు సమన్యాయం చేసినట్లుగా అవుతుంది అని అంటున్నారు. దీనికి ప్రభుత్వం కొత్తగా బిల్లు ప్రవేశపెట్టాలా లేక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అన్న ఆలోచనలు కూడా ప్రభుత్వ వర్గాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి ఈ విధంగా వేసవి, శీతాకాల సమావేశాలు జరిపే రాష్ట్రాలు దేశంలో కొన్ని ఉన్నాయి. దానికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ప్రభుత్వాలు విధాన నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. అది పాలనాపరమైన వ్యవహారంగానే కూడా ఉంటుంది అని అంటున్నారు. ఇక రాజధాని మాత్రం ఒక్కటే ఉంటుంది.

అది అమరావతిగానే ఉంటుంది. దాని వల్ల అమరావతికి ఉండాల్సిన హంగులు అన్నీ ఉంటాయి. అలాగే శాసనసభ, సచివాలయం పరిపాలనా భవనాలు, ఇతరమైనవి అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇక బడ్జెట్ సమావేశాలు ప్రతీ ఏటా నిర్వహిస్తారు. ఇది ఎక్కువ రోజుల పాటు సాగుతుంది. ఆ టైం కి మార్చి నెల వస్తుంది. అంటే వేసవి కాలం అన్న మాట.

దాంతో గుంటూరు జిలాలోని అమారావతి కంటే కూడా విశాఖలో ఈ సమావేశాలు నిర్వహిస్తే కొంత కూల్ గా వాతావరణం ఉండడమే కాకుండా అందరికీ ఆహ్లాదంగా ఉంటుంది. అదే టైం లో ఈ సమావేశాల నిర్వహణ ద్వారా విశాఖను కూడా రాజధానిగా గుర్తించామన్న ఫీలింగ్ కూడా జనాల్లో ఉంటుంది.

అలాగే నవంబర్ డిసెంబర్ నెలలలో నిర్వహించే వింటర్ సెషన్ ని రయాలసీఎమలోని కర్నూల్ లో నిర్వహిస్తే కూడా అక్కడ ప్రాంతాల వారు హ్యాపీ ఫీల్ అవుతారు. స్థానికంగా ఉన్న సమస్యలను సభ దృష్టికి ఆ ప్రాంతీయులు తీసుకువచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే పేరుకు రాజధాని అని అనరు కానీ కర్నూల్, విశాఖ కూడా ఆ విధంగా రాజధాని హోదాను అందుకుంటాయి అన్న ప్రతిపాదన అయితే ఉంది.

ఇక దీనికి మరింతగా హంగులు చేకూర్చాలంటే మినీ సచివాలయాలు కూడా విశాఖ కర్నూల్ లలో పెట్టుకోవచ్చు. అలాగే హై కోర్టు గుంటూరులోనే ఉన్నా కూడా బెంచ్ లని విశాఖ, కర్నూల్ లలో పెట్టడం ద్వారా మూడు ప్రాంతాలకు న్యాయం చేయవచ్చు. దీని వల్ల న్యాయపరంగా అవరోధాలు ఏమీ ఉండవనే అంటున్నారు. ప్రభుత్వం ఈ రకమైన ప్రతిపాదనలను సీరియస్ గా పరిశీలిస్తోందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.