Begin typing your search above and press return to search.

మునుగోడులో బీజేపీకి పడే ప్రతి ఓటు ఆ పార్టీ గెలుపునకేనా..!

By:  Tupaki Desk   |   29 Oct 2022 3:52 AM GMT
మునుగోడులో బీజేపీకి పడే ప్రతి ఓటు ఆ పార్టీ గెలుపునకేనా..!
X
మరో వారం రోజుల్లో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా ఇతర పక్షాలూ ఇటువైపే వేచి చూస్తున్నాయి. దీని ఫలితంపైనే తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఇందులో గెలిచిన పార్టీనే వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తుందని అంతటా చర్చ జరుగుతోంది.

అయితే.. ఈ అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నిక ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉండదని.. ఉప ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల వల్ల ఫలితాలు వస్తాయని.. సాధారణ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితిపై ఆధారపడి ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీ గాకుండా ఏ ఉప ఎన్నికైనా అధికార పార్టీకే కలిసి వస్తుందని.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫలితాలు తారుమారు కావని వాదిస్తున్నారు.

దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఆయా అభ్యర్థుల వల్ల సాధ్యమైందని.. ఇందులో పార్టీ గెలుపు గాలివాటమేనని మిగతా పక్షాలు తేటతెల్లం చేస్తున్నాయి. మునుగోడులో అభ్యర్థిపై అంత సానుకూలత లేదని.. ఆ పార్టీకి అక్కడ అంత బలం కూడా లేదని అంటున్నాయి. ఇది ఏ విధంగా తీసుకున్నా గెలుపు తమ ఖాతాలోకే వస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

అయితే.. ఈ పరిణామాలపై నిశితంగా గమనిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ మరో ఆసక్తికర అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. టీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని మునుగోడులో గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ రెండు పార్టీలూ డబ్బులు నీళ్లల్లా ఖర్చు చేసినా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమా వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ, అధిక రేట్లు, పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజలు ఆ రెండు పార్టీల పట్ల విముఖంగా ఉన్నారని చెబుతున్నారు.

అదీకాకుండా బీజేపీకి వేసే ప్రతి ఓటూ టీఆర్ఎస్ కే లాభిస్తుందని.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని గుర్తు చేస్తున్నారు. గులాబీ పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లు అన్నీ కాంగ్రెస్ కే రావాలని ఆ పార్టీ భావిస్తోంది. లేదంటే వ్యతిరేక ఓట్లు చీలి మళ్లీ టీఆర్ఎస్సే రావొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కమలం పార్టీకి ఓటు వేసే ముందు ఓటరు ఆలోచించాలని.. ఆ పార్టీకి పడే ప్రతి ఓటూ టీఆర్ఎస్ విజయానికి దోహదపడుతుందని హితబోధ చేస్తున్నారు. చూడాలి మరి హస్తం నేతల ఆశలు ఏమేరకు నెరవేరుతాయో..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.