Begin typing your search above and press return to search.

బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో ఇప్పుడేం కానుంది? 6 వారాల్లో ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   22 July 2022 5:04 AM GMT
బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో ఇప్పుడేం కానుంది? 6 వారాల్లో ఏం జరగనుంది?
X
సంపన్న దేశాల్లో ఒకటి.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలేసిన దేశానికి.. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ప్రధాని ఎన్నికలు జరుగుతున్నాయి. బ్రిటన్ చరిత్రలో మొదటిసారి.. ఒకప్పుడు తాము ఏలిన దేశానికి చెందిన వ్యక్తి ప్రధాని కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎంతో పోటీని అధిగమించి.. ప్రధాని కుర్చీలో కూర్చోవటానికి సరిగ్గా అడుగు దూరంలో నిలిచారు. ఈ రౌండ్ లోనూ విజయం సాధిస్తే.. బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి రిషి సునక్ కానున్నారు. భారత సంతతికి చెందిన రిషి.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి అల్లుడన్న సంగతి తెలిసిందే.

తొలి విడత రేసులో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతులో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్.. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్. వీరిద్దరి మధ్య ఫైనల్ పోరు జరగనుంది. తదుపరి ఎన్నికకు మరో ఆరు వారాల సమయం ఉంది. ఈ రౌండ్ లో ఎవరైతే కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మదిని దోచుకుంటారో వారే తదుపరి ప్రధానమంత్రి అవుతారు.

ఆ వ్యక్తే.. ప్రస్తుతం బోరిస్ జాన్సన్ ఉన్న కుర్చీలో కూర్చోవటానికి అర్హత సాధిస్తారు. దీని కోసం.. ఫైనల్ పోరులో తలపడుతున్న రిషి.. లిజ్ లు బ్రిటన్ వ్యాప్తంగా ఆరు వారాలు పర్యటించనున్నారు. తమ మద్దతుదారుల్ని కలిసి మద్దతు కోరటంతో పాటు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న అధిక్యతను చూస్తే.. లిజ్ ట్రస్ తో పోలిస్తే రిషినే ముందున్నారు. అది కూడా స్పష్టమైన అధిక్యతతో.

ప్రస్తుతానికి రిషికి 137 మంది ఎంపీలు అండగా నిలిస్తే.. లిజ్ ట్రస్ కు 113 మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారు. అయితే.. చివరి రౌండ్లో పార్టీ సభ్యుల మద్దతు సొంతం చేసుకోవటం చాలా కీలకం. మరి.. రానున్నఆరు వారాల్లో ఏం జరగనుంది? అన్నది చూస్తే.. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాం? ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారాలు.. తమ విధానాలను స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైతే ఎక్కువ మందిని ప్రభావితం చేయగలుగుతారో వారే విజేతగా అవతరించే వీలుంది.

తాను ప్రధాని అయితే ఏమేం చేస్తామన్న దానికి రిషి.. లిజ్ ల ప్రాధాన్యతల్ని చూస్తే..

రిషి

- ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటానికే తొలి ప్రాధాన్యత
- ఆర్థికాభివ్రద్దిని సాధించటం ద్వారా పన్నుల భారాన్ని తగ్గిస్తా
- దివంగత మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అడుగుజాడల్లోనే పాలన కొనసాగిస్తా

లిజ్ ట్రస్

- దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తా
- దివంగత మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ పాలనా తీరును ఫాలో అవుతా.

ఆరు వారాల్లో ఏం జరుగుతుంది?

ప్రధాని పదవికి అర్హులను ఎన్నుకునే ప్రక్రియలో చివరి అంకం మొదలైంది.ఇందులో భాగంగా తొలుత ఆరు వారాల పాటు వీరిద్దరు దేశ వ్యాప్తంగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో భేటీ నిర్వమిస్తారు. తమకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఆయా సభల్లో ప్రసంగిస్తారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇవన్నీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం తుది రౌండ్లో ఓట్లు వేసే సభ్యుల సంఖ్య దాదాపు 1.7 లక్షల వరకు ఉండొచ్చు. కొంత తగ్గినా తగ్గొచ్చు. ఆగస్టు 5న సభ్యులకు పోస్టల్ బ్యాలెట్లు అందుతాయి. సెప్టెంబరు 2 తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించే వెసులుబాటు ఉంటుంది. సెప్టెంబరు 5న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి.. తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.