Begin typing your search above and press return to search.

రాక రాక వస్తున్న బాబు...ల్యాండ్ అయ్యేది అక్కడే...?

By:  Tupaki Desk   |   2 May 2022 10:30 AM GMT
రాక రాక వస్తున్న బాబు...ల్యాండ్ అయ్యేది అక్కడే...?
X
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉత్తరాంధ్రా సెంటిమెంట్ నిండుగా ఉంది. టీడీపీ స్థాపించినది మొదలు 2019 దాకా ఇక్కడి జిల్లాలు అన్నీ కూడా టీడీపీకే బాగా కొమ్ము కాసాయి. తెలుగుదేశం అంటే పూనకం తెచ్చుకునే జనాలు ఇక్కడే కనిపిస్తారు. ఆ పార్టీకి ఓటేయాలని ఆరాటపడే వారు ఇక్కడే ఎక్కువ. టీడీపీ ఎక్కడ ఓడినా పరువు నిలిపేది మాత్రం ఉత్తరాంధ్రానే.

అలాంటి జిల్లాలు ఫస్ట్ టైమ్ 2019 ఎన్నికల్లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయి. ఏకంగా ఫ్యాన్ నీడకు చేరిపోతే అరడజన్ సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీకి దక్కాయి. ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఈసారి కూడా ఓడితే అధికారానికి టీడీపీ దూరం కావడం తధ్యం.

అందుకే టీడీపీ ఉత్తరాంధ్రాలో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లతో పాటు, అయిదు ఎంపీ సీట్లలో మెజారిటీని గెలుచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు ఎపుడు జిల్లాల టూర్లు చేపట్టినా ఉత్తరాంధ్రా నుంచే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. దానికి నాంది అన్నట్లుగా ఈ నెల 4న చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా టూర్ కి వస్తున్నారు.

ఆ రోజున ఆయన వైసీపీ సర్కార్ పెంచిన పన్నులు, విద్యుత్ చార్జీల బాదుడుకు వ్యతిరేకంగా బాదుడే బాదుడు పేరిట సాగే నిరసన కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అది కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం అయిన ఆముదాలవలసలో పొందూరు మండలంలో జరిగే కార్యక్రమానికి బాబు అటెండ్ అవుతారు.

అంటే ఒక విధంగా స్పీకర్ సొంత సీట్లో బాబు ల్యాండ్ అయి అక్కడ టీడీపీకి హుషార్ తెస్తారన్న మాట. ఇక ఇక్కడ టీడీపీ తరఫున ఉన్నది ఎవరో కాదు తమ్మినేని మేనల్లుడు అయిన కూన రవికుమార్. ఆయనే శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూడా. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాలలో అడుగు పెట్టి ఇప్పటికి ఏడాది పై దాటింది. గత ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల వేళ ఆయన విశాఖ దాకా వచ్చారు.

చాలా కాలానికి చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాలకు వస్తున్న నేపధ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి టీడీపీ క్యాడర్ రెడీగా ఉంది. మరో వైపు ఈసారి ఎలాగైనా ఉత్తరాంధ్రా రాజకీయాన్ని కొట్టి పట్టి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్న తమ్ముళ్లకు బాబు టూర్ తెగ హుషార్ తెప్పిస్తోంది. మరి బాబు ఉత్తరాంధ్రా నుంచి అందునా వెనకబడిన శ్రీకాకుళంలోని తమ్మినేని ఇలాకా నుంచి జగన్ సర్కార్ కి ఏ రకమైన హెచ్చరికలు పంపుతారో చూడాలి.