Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ పై టెస్టులో ఓటమి దిశగా టీమిండియా.. భారమంతా పంత్ పైనే

By:  Tupaki Desk   |   24 Dec 2022 11:16 AM GMT
బంగ్లాదేశ్ పై టెస్టులో ఓటమి దిశగా టీమిండియా.. భారమంతా పంత్ పైనే
X
ఏం జరుగుతోంది..? ఏదో జరుగుతోంది.. బంతి అనూహ్యంగా తిరుగుతోంది.. టీమిండియా పరాజయం దిశగా సాగుతోంది. బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన స్థితి నుంచి ఓటమి వైపు వెళ్తోంది మన జట్టు. ఇదే జరిగితే టెస్టుల్లో తొలిసారి బంగ్లాదేశ్ పై పరాజయం పాలైనట్లవుతుంది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు నేరుగా చేరే అవకాశమూ కోల్పోతుంది. అన్నిటికి మించి కోచ్ రాహుల్ ద్రవిడ్ కు పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది.

ఇంకో వంద కొట్టాలి.. కొడతారా?

బంగ్లాదేశ్ తో రెండో టెస్టు వేదికపై మిర్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో మోస్తరు లక్ష్యమైనా కష్టమే. అయితే, రెండు రోజులుగా టెస్టు జరిగిన తీరు చూశాక.. టీమిండియాకు ఈ పరిస్థితి ఎదురుకాదని మహా అయితే లక్ష్యం 50 పరుగులకు అటు ఇటు ఉంటుందని భావించారు. కానీ.. అంతా తలకిందులైంది. మన జట్టుకు 145 పరుగుల లక్ష్యం ఎదురైంది. అయినా పుజారా, కోహ్లి ఉండడంతో దీనిని సాధించగలరని భావించారు.

వీరిద్దరితో పాటు కెప్టెన్ రాహుల్ (2), మరో ఓపెనర్ శుబమన్ గిల్ (7) దారుణంగా విఫలమయ్యారు. పుజారా (6) స్టంపౌటై హతాశులను చేశాడు. కోహ్లి (1) తీవ్రంగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (26 బ్యాటింగ్), నైట్ వాచ్ మన్ గా వచ్చిన ఉనద్కత్ (3 బ్యాటింగ్) ఉన్నారు.

అక్షర్ తో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ రాణిస్తేనే టీమిండియా మిగతా 100 పరుగులను అందుకోగలదు. జట్టు మిగతా బ్యాటర్లు విఫలమైన చోట అక్షర్ మూడు ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించాడు. పంత్, శ్రేయస్ కూడా ఆదివారం ఇలానే ఆడితే జట్టుకు పరాజయం తప్పుతుంది.

బంగ్లా భలే ఎదురు నిలిచిందే..

227.. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ స్కోరిది.. మోమినుల్ హక్ (84) రాణించడంతో ఆ మాత్రం పరుగులు చేసింది. ప్రతిగా టీమిండియా పంత్, అయ్యర్ ధాటితో 314 పరుగులు చేసింది. 87 పరుగుల ఆధిక్యం దక్కింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు చూస్తే ఆ జట్టు కనీస లక్ష్యాన్ని కూడా విధిస్తుందన్న నమ్మకం లేకపోయింది. 70 పరుగులకే నాలుగు వికెట్లు.. 102కు ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాను వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ లిటన్ దాస్ (98 బంతుల్లో 73; 7 ఫోర్లు) ఆదుకున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ అడ్డుగా నిలిచాడు. నూరుల్ హసన్, తస్కిన్ అహ్మద్ చెరో 31 పరుగులు చేసి లిటన్ కు సహకారం అందించారు. దీంతో 231 పరుగులకు ఆలౌటైంది. భారత్ కు 145 పరుగుల టార్గెట్ ఇచ్చింది.

రాహుల్, గిల్ పేలవం..

మోస్తరు కూడా కాని లక్ష్య ఛేదనలో టీమిండియాకు చుక్కెదురైంది. తాత్కాలిక కెప్టెన్ గా ఈ సిరీస్ లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయిన రాహుల్ కేవలం 7 బంతులే ఆడాడు. గిల్ 35 బంతులు కాచుకున్నా పెద్ద స్కోరు చేయలేకపోయాడు. పుజారా 12 బంతులాడి వెనుదిరిగాడు. కోహ్లి 22 బంతులు ఎదుర్కొన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. ఓసారి ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. వీరు నలుగురూ వెనుదిరగడంతో టీమిండియా ఓటమి దిశగా వెళ్తోంది. ఆదివారం పంత్ ఆడకుంటే మన జట్టుకు బంగ్లాదేశ్ పై టెస్టుల్లో ఇదే తొలి ఓటమిగా మిగులుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.