Begin typing your search above and press return to search.

కొడాలి కోటలో పాగా : గుడివాడలో మహానాడు.. నిమ్మకూరులో బస

By:  Tupaki Desk   |   23 Jun 2022 11:30 AM GMT
కొడాలి కోటలో పాగా  : గుడివాడలో మహానాడు.. నిమ్మకూరులో బస
X
తెలుగుదేశం పార్టీ హిట్ లిస్ట్ ని రెడీ చేసి ఉంచుకుంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ కొన్ని ముఖాలను అసెంబ్లీలో మళ్ళీ చూడకూడదని గట్టి పట్టుదలగా ఉంది. అలాంటి జాబితాలో మొదటి పేరుగా వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నారు. కొడాలి నాని వైసీపీ సర్కార్ లో మంత్రి అయ్యాక చంద్రబాబు మీద ఎన్నో రకాలుగా అనుచితమైన కామెంట్స్ చేశారు.

అవి ఎలా ఉన్నాయీ అంటే బాబు అంటే ఇష్టం లేని వారు కూడా పాపం పెద్దాయన మీద ఇన్ని మాటలా అని జాలిపడేలా. మరి బాబు అంటే గిట్టని వారికే అవి అలా ఉంటే హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నానికి మాజీని చేయాలన్న గట్టి సంకల్పంతో టీడీపీ ఉంది.

ఈ మేరకు అన్ని రకాల సామాజిక సమీకరణలను అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. అదే విధంగా రాజకీయంగా కూడా వ్యతిరేక ఓటు ఎక్కడా చీలకుండా చేసి నానిని అష్టదిగ్బంధనం చేయలన్నది టీడీపీ పట్టుదల. ఇక ఇప్పటిదాకా ఉత్తరాంధ్రా జిల్లాలలో టూర్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇపుడు క్రిష్ణా జిల్లాలో అడుగుపెడుతున్నారు.

సాధారణంగా క్రిష్ణా గుంటూరు జిల్లాలలో టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఇక మూడేళ్ళ వైసీపీ పాలన తరువాత టీడీపీ స్కోర్ ఇంకా పెరిగింది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ కీలకమైన సమయమలో గుడివాడలో బాబు అడుగుపెడుతున్నారు. ఏకంగా గుడివాడలోనే మినీ మహానాడుని చేయాలని చూస్తున్నారు. ఎన్టీయార్ చిరునామా అయిన గుడివాడలో బాబు ఇలా సమర శంఖం పూరించడం అంటే కొడాలి మీద కొడవలి ఎత్తినట్లే అంటున్నారు.

ఇక గుడివాడలో మినీ మహానాడుని కనీవినీ ఎరగని విధంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఆ సభలోనే నేరుగా కొడాలి నాని మీద బాబు విరుచుకుపడతారు అని అంటున్నారు. ఇక ఈ సభ పూర్తి కాగానే ఆ రోజు రాత్రి బాబు బస చేసేది నిమ్మకూరులోనట. నిమ్మకూరు అంటే ఎన్టీయార్ పుట్టిన గడ్డ. కన్ను తెరచిన ప్రదేశం.

అంతటి ప్రాముఖ్యత ఉన్న నిమ్మకూరులో బాబు తన రాజకీయ జీవితాన ఇప్పటిదాకా వెళ్ళినా అక్కడ రాత్రి బస చేసి అన్నేసి గంటలు గడిపిన దాఖలాలు లేవు. కానీ ఈసారి కొడాలి నానిని ఇంటికి పంపాలన్న పట్టుదలతో నిమ్మకూరుని బాబు తలచుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీయార్ జపంతో పెద్దాయన సెంటిమెంట్ తో గుడివాడలో పసుపు జెండా ఈసారి కచ్చితంగా రెపరెపలాడించాలన్న పంతంతో బాబు ముందుకు కదులుతున్నారు. ఇది ఒక విధంగా కొడాలి నానికి పెను సవాల్ అనే చెప్పాలి.