Begin typing your search above and press return to search.

తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర సాగేది ఇలా..!

By:  Tupaki Desk   |   3 Oct 2022 3:33 AM GMT
తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర సాగేది ఇలా..!
X
దేశవ్యాప్తంగా జరిగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడులోని కన్యాకుమారిలో తన యాత్రను రాహుల్‌ ప్రారంభించారు. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తన పాదయాత్రను ముగించుకున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది.

కాగా కర్ణాటకలో భారత్‌ జోడో యాత్ర ముగిశాక రాహుల్‌ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకు రూట్‌ మ్యాప్‌ కూడా ఖరారు చేశారు. ఈ మేరకు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

కాగా తెలంగాణ కాంగ్రెస్‌ రూపొందించిన ప్రతిపాదిత రూట్‌ మ్యాప్‌ ప్రకారం... రాహుల్‌ గాంధీ కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి కృష్ణా నది దాటి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు.

అక్టోబర్‌ 24న తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్‌ గాంధీ సుమారు 15 రోజుల పాటు పాదయాత్ర చేస్తారు. మక్తల్, దేవరకొండ, మహబూబ్‌నగర్‌ టౌన్, జడ్చర్ల, షాద్‌ నగర్, శంషాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ పాతబస్తీలోకి వస్తారు. ఆరాంఘర్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, మొజాంజాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి దర్గా, విజయ్‌నగర్‌ కాలనీ, పెన్షన్‌ ఆఫీసు, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత ముత్తంగి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా రాహుల్‌ నడుస్తారు. అక్కడి నుంచి సంగారెడ్డి క్రాస్‌ రోడ్స్, జోగిపేట, శంకరపేట్, మద్నూర్‌ల మీదుగా మహారాష్ట్రలోకి రాహుల్‌ గాంధీ ప్రవేశిస్తారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ప్రతిపాదిత రూట్‌ మ్యాప్‌ను మహారాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్‌ థోరట్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ నివాసంలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్‌ తదితర నేతలతో ఈ బృందం సమావేశమై.. రూట్‌ మ్యాప్‌పై చర్చించింది.

మరోవైపు తెలంగాణలో రాహుల్‌ గాంధీ నిర్వహించే పాదయాత్రలో ప్రజాసంఘాలు, సోషలిస్టు పార్టీల నాయకులు సహా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.