Begin typing your search above and press return to search.

సామిరంగ ఇంగ్లండ్ తో సెమీస్.. రణరంగమే

By:  Tupaki Desk   |   8 Nov 2022 2:30 AM GMT
సామిరంగ ఇంగ్లండ్ తో సెమీస్.. రణరంగమే
X
ఒకటో నంబరు నుంచి ఏడో నంబరు వరకు హిట్టర్లే హిట్టర్లు.. నాణ్యమైన నలుగురు పేసర్లు.. ఇద్దరు నిఖార్సైన స్పిన్నర్లు.. ప్రపంచంలోనే మేటి పేస్ ఆల్ రౌండర్.. ఇదీ ఇంగ్లండ్ జట్టు.. అలాంటి జట్టుతో టీమిండియా గురువారం టి20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో తలపడనుంది. దీన్నిబట్టే ఈ మ్యాచ్ ఎంతటి క్లిష్టమైనదో చెప్పొచ్చు. అది కూడా ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో ఇంగ్లండ్ లాంటి జట్టను ఎదుర్కొనడం అంటే మామూలు మాటలు కాదు. అందుకనే ''ఇంగ్లాండ్‌తో హై ఓల్టేజీ గేమ్ తప్పదు'' అంటున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్‌ సన్నద్ధతపై కెప్టెన్‌ రోహిత్ కీలక విషయాలను వెల్లడించాడు. ''ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ చాలా కీలకం. అయితే అంతకుముందు పిచ్‌ పరిస్థితులకు త్వరగా సర్దుబాటు కావడం మరీ ముఖ్యం. అడిలైడ్‌ వేదికగా ఒక మ్యాచ్‌ ఆడటం మాకు సానుకూలాంశం. అయితే ఇంగ్లాండ్‌తో సవాల్‌ బాగుంటుందని భావిస్తున్నా. వారు చాలా బాగా ఆడి ఇక్కడకు వచ్చారు. అయితే ఇక్కడ మేం ఏం సాధించామనేది మరిచిపోం. జట్టుకు అవసరమైన విధంగా వ్యక్తిగత ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. కచ్చితంగా ఇదొక హై ఓల్టేజీ గేమ్‌ అవుతుంది. మేం మంచిగా ఆడితే ఆటోమేటిక్‌గా విజయం వరించే అవకాశం ఉంది. అయితే అందుకు తగ్గట్లుగానే పక్కా ప్రణాళికతో బరిలోకి దిగి.. మైదానంలో అమలు చేయాల్సి ఉంటుంది''అని పేర్కొన్నాడు.

బలమైనదే.. బలహీనమైనదీనూ

ఇంగ్లండ్ పేపర్ పై ఎంత బలమైన జట్టుగా కనిపిస్తున్నదో మైదానంలోకి దిగితే ఒక్కోసారి అంతే బలహీనంగా కనిపిస్తుంది. శనివారం అఫ్గానిస్థాన్ తో మ్యాచ్ లో మాదిరి లక్ష్యాన్ని కూడా ఇంగ్లండ్ కష్టపడి ఛేదించింది. కెప్టెన్ బట్లర్, లివింగ్ స్టన్, మోయిన్ అలీ సహా కీలక ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆల్ రౌండర్ స్టోక్స్ నిలవకుంటే మ్యాచ్ లో ఓడిపోయేదే.

ఇక బౌలింగ్ లో 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే మార్క్ ఉడ్ గతి తప్పాడో ఇక అంతే.. వోక్స్ నాణ్యమైన పేసరే అయినా.. అతడిని ఎదుర్కొనగల బ్యాట్స్ మన్ టీమిండియాలో ఉన్నారు. కుర్ర ఆల్ రౌండర్ శామ్ కర్రన్ కాస్త ఆశలు రేపుతున్నాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రమాదకారి. అయితే, వీరంతా ఉమ్మడిగా వైఫల్యం చెందే లక్షణం ఇంగ్లండ్ కు ఉంది. ఐర్లాండ్ లాంటి జట్టు మీద ఓటమే దీనికి నిదర్శనం.

టీమిండియా జర భద్రం

ఇంగ్లండ్ మంచి దూకుడు మీద ఉంది. వారికి ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఇక ఖతమే. ఆ దూకుడును తొలినుంచే తుంచేస్తే టీమిండియాకు గెలుపు మార్గం సుగమం అవుతుంది. ఇంగ్లండ్ ఒక్కసారి పుంజుకొందంటే.. మ్యాచ్ లో మళ్లీ కోలుకోవడం కష్టం. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ లో అదరగొట్టాలి. రోహిత్ లయ అందుకుంటే తిరుగుండదు. భారీ స్కోరు ఖాయం. రాహుల్, కోహ్లీ విలువైన పరుగులు జోడిస్తే.. మిగతా సూర్య, పంత్ చూసుకుంటారు. మరోవైపు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కు కళ్లెం వేయడం చాలా సవాలుతో కూడుకున్నది.

అయితే,ఇక్కడే జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో టీమిండియాకు కాస్త ఆందోళన నెలకొంది. షమీ, భువనేశ్వర్, కొత్త పేసర్ అర్షదీప్ ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ ను ఎలా అడ్డుకుంటారో చూడాలి. హార్దిక్ మినహా మరో ఆల్ రౌండర్ లేకపోడం కూడా భారత్ కు ఇబ్బందే. జడేజా లేకపోవడంతో అన్నిటికి మించి స్పిన్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. అశ్విన్, అక్షర్ ఏమేరకు రాణిస్తారో చూడాలి. అయితే, సమష్టిగా ఆడితే ఈ సమస్యలన్నీ హుష్ కాకి అంటాయి అనడంలో సందేహం లేదు.. ==విజయీభవ



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.