Begin typing your search above and press return to search.

టీడీపీ ప్ర‌యోగ‌శాల‌గా మారిపోయిందా ?

By:  Tupaki Desk   |   3 Jun 2022 11:34 AM GMT
టీడీపీ ప్ర‌యోగ‌శాల‌గా మారిపోయిందా ?
X
దేవుడి విశ్వాసురాలిని అని చెప్పుకునే వారెవ్వ‌రూ అబ‌ద్ధాలు చెప్ప‌రు. ఇత‌రుల‌ను దూషించ‌రు. పొర‌పాటున దూషించినా కూడా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెబుతారు.. ఇవీ దివ్య‌వాణి అనే విశ్వాసురాలి గురించి సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న మాట‌లు. చ‌ర్చ‌కు తావిస్తున్న మాట‌లు. అయినా త‌మ పార్టీ కొత్త వారిని నెత్తినెక్కించుకుని ఓ పెద్ద ప్ర‌యోగ‌శాల‌గా మారిపోయింద‌ని, అర్జెంటుగా ఈ విధానం మారాల్సిందేనని ఫ‌క్తు టీడీపీ అభిమానులు ప‌ట్టుబ‌డుతున్నారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

ఇంత‌వ‌ర‌కూ ఆమె ఓ అధికార ప్ర‌తినిధి హోదాలో ప్ర‌తిప‌క్ష పార్టీపై పోరాడింది ఏమీ లేదు. అన‌గా ప్ర‌త్య‌క్ష పోరుకు సిద్ధ‌మై అరెస్టులు అయిన దాఖ‌లాలే లేవు. పోనీ అనుచిత వ్యాఖ్య‌ల కార‌ణంగా పార్టీ మైలేజీ పెరిగిందా అంటే అదీ లేదు. ప‌రువు పోగొట్టిన ప‌నులే ఉన్నన్నాళ్లూ చేసి వెళ్లారు. ఇంకా చెప్పాలంటే అంత వాగినా కూడా ఆమె పై ఇంత‌వ‌ర‌కూ ఒక్క అక్ర‌మ కేసు లేదు. ఇంకా చెప్పాలంటే ఆమె కార‌ణంగా తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం అయింది కూడా లేదు. తెలుగు మ‌హిళా విభాగం బాగుప‌డిందీ లేదు. అయినా ఆమె ఇప్పుడు పార్టీని వీడి బాబును ఉద్దేశించి కానీ పార్టీని ఉద్దేశించి కానీ కొన్ని అనుచిత వ్యాఖ్య‌లు చేసి, ఆఖ‌రులో మాత్రం త‌న‌కు అధినేత అంటే గౌర‌వం ఉంద‌ని చెప్ప‌డం దివ్య‌వాణికి మాత్ర‌మే చెల్లింది. ఇదీ సోష‌ల్ మీడియాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ అభిమానుల అంత‌ర్మ‌థ‌నం.

తెలుగుదేశం పార్టీ ప్ర‌యోగ‌శాల‌గా మారిపోయిందా ? ఇదే ప్ర‌శ్న నిన్న‌టి నుంచి సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వినిపిస్తోంది. దివ్య‌వాణి ఎపిసోడ్ త‌రువాత పార్టీలోకి వ‌చ్చే వారు, పార్టీ నుంచి వెళ్లే వారు వీరంద‌రిపై కూడా నిఘా ఉంచాల్సిన త‌రుణం రానే వ‌చ్చింది అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. దివ్య‌వాణి పార్టీలో ఉన్నంత కాలం చాలా అంటే చాలా ద‌ర్జానే అనుభ‌వించార‌ని, వెళ్లాక తిట్ల దండ‌కం అందుకోవ‌డం ఏం బాలేద‌ని, ఇదేవిధంగా గతంలో రోజా కూడా ఇక్క‌డే ఉండి రాజ‌కీయంగా ఎదిగి త‌రువాత అధినేత బాబును అన‌రాని మాట‌లు అన్నార‌ని వేద‌న చెందుతున్నారు కొంద‌రు టీడీపీ అభిమానులు. పార్టీ కొత్త వాళ్లంద‌రికీ ఓ ప్ర‌యోగ‌శాల‌గా మారిపోయింద‌ని, ఎవ‌రైనా ఎప్పుడైనా రావొచ్చు, ఎవ్వ‌రైనా ఎప్పుడైనా పోవ‌చ్చు అన్న విధంగా ఉంద‌ని, ప‌దవులు, ప్రాధాన్యం ఇవే త‌ప్ప ! జ‌నంలోకి పోయి మాట్లాడిన దాఖలాలే లేవ‌ని అంటోంది టీడీపీ సోష‌ల్ మీడియా వింగ్.

ఆ రోజు రోజా కానీ త‌రువాత యామిని సాధినేని కానీ ఇంకా చాలా మంది పార్టీని విడిచి వెళ్లాక నోటికి వ‌చ్చిందంతా వాగార‌ని, అస‌లు వీళ్ల‌కు రాజ‌కీయ రంగంలో ఏ కేరాఫ్ లేని రోజుల్లో ఆదుకున్న‌ది, ప‌దవులు ఇచ్చి గౌర‌వించుకున్న‌ది టీడీపీనే క‌దా !

అని కూడా అంటున్నారు ఇంకొంద‌రు. ఇప్పుడంటే మంత్రి పద‌వి వచ్చింది కానీ మొన్న‌టి దాకా ప‌సుపు దుస్తుల‌తో ఊరు వాడా తిరిగింది ఎవ‌ర‌ని? రోజా అనే లీడ‌ర్ ఆ రోజు ఎవ‌రిని ఉద్దేశించి పొగ‌డ్త‌ల వాన కురిపించార‌ని ? ప్ర‌శ్నిస్తున్నారు వీరంతా ! ఇదే విధంగా మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ కూడా బాబు స‌ర్ నేను మీ మొక్క అని అంటూ ఆఖ‌రికి ఆయ‌న్నే టార్గెట్ గా చేసుకుని నానా మాట‌లూ అన్నార‌ని, వీటిని ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేర‌ని అంటున్నారు వీరంతా !

దివ్య వాణి కార‌ణంగా పార్టీ పొందిన లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ ఉంది అని, ఆ రోజు కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌డం ఆమె స్థాయికి త‌గ‌దనే తాము చెప్పామ‌ని కొంద‌రు తెలుగు మ‌హిళ‌లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటూ కూడా ప‌ద‌వులు అందుకోని కార్య‌క‌ర్త‌లెంద‌రో ఉన్నార‌ని, ప‌ల్ల‌కీల్లో కూర్చోవ‌డం క‌న్నా ప‌ల్ల‌కీల మోత‌కే ఎంద‌రెంద‌రో ప్రాధాన్యం ఇచ్చార‌ని అంటున్నారు వీరంతా ! ఈ నేప‌థ్యంలో ఇక‌నైనా పార్టీలోకి వ‌చ్చిన వారి క‌మిట్మెంట్ ఎంత‌? వాళ్లంతా ఇక్క‌డ ఉంది ఏం సాధిస్తారు ?పార్టీ వీడాక ఏం మాట్లాడుతున్నారు? వారిని నిలువ‌రించాల్సిన బాధ్య‌త ఎవ‌రిది ? అన్న విష‌యాల‌పై స‌మాలోచ‌న‌లు చేసిన‌ప్పుడు మాత్ర‌మే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. లేదంటే నాయ‌కులు కొంద‌రి కార‌ణంగా పార్టీ నిండా మునిగిపోతోంద‌ని, ప‌రువు పోయాక దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టినా అవేవీ ఫ‌లితం ఇవ్వ‌వు అని అంటున్నారు టీడీపీ అభిమానులంతా !