Begin typing your search above and press return to search.

'జొమాటో'ను నమ్మినందుకు రూ.లక్ష కోట్లను ఆవిరి చేసేసిందే?

By:  Tupaki Desk   |   11 May 2022 8:49 AM GMT
జొమాటోను నమ్మినందుకు రూ.లక్ష కోట్లను ఆవిరి చేసేసిందే?
X
షేర్ మార్కెట్ ను ఒక్కొక్కరు ఒక్కోలా నిర్వచిస్తుంటారు. కొందరు జూదం అంటే.. మరికొందరు శాస్త్రీయ అవగాహనతో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అకళింపు చేసుకొని అందులో పెట్టుబడి పెట్టగలితే దానికి మించింది సంపాదన వనరు మరొకటి ఉండదంటారు.

ఈ కారణంతోనే కరోనా కారణంగా వర్కు ఫ్రం హోం కారణంగా పెద్ద ఎత్తున షేర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినోళ్లు బోలెడంత మంది ఉన్నారు. షేర్ మార్కెట్లో కొన్ని షేర్లు అనూహ్యంగా పెరగటం ఉంటుంది. అదే సమయంలో మరికొన్ని షేర్లు మాత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ దారుణమైన అనుభవాన్ని మిగులుస్తాయి. తాజాగా అందరికి సుపరిచితమైన జొమాటో ఇలాంటి చేదు అనుభవాన్నే మిగిల్చింది.

జొమాటో షేర్ల పతనం ఈ మధ్యన తరచూ చోటు చేసుకోవటమే కాదు.. తాజాగా ఈ షేర్ ధర భారీగా కుంచించుకు పోయింది. మంగళవారం తన జీవనకాల కనిష్ఠమైన రూ.51.30కు పడిపోయింది. ఈ రోజు (బుధవారం) మరో పది పైసలు పడిపోయింది. మంగళవారంతో పోలిస్తే.. బుధవారం ఈ షేరుకు జరిగిన నష్టం తక్కువనే చెప్పాలి. పబ్లిక్ ఇష్యూ ధర రూ.76తో పోలిస్తే ఈ షేరు విలువ దాదాపు 30 శాతం తగ్గిపోయింది.

నిజానికి స్టాక్ మార్కెట్లో జొమాటో ప్రస్థానాన్ని చూస్తే.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లి.. తక్కువ వ్యవధిలోనే పాతాళానికి పడిపోయిన వైనం కనిపిస్తుంది. గత ఏడాది జూలై 23 స్టాక్ మార్కెట్ లో నమోదు కాగా.. నవంబరు 16న ఈ షేరు విలువ రూ.169.10 వద్ద రికార్డు స్థాయి మొత్తానికి చేరుకుంది.

ఆల్ టైం రికార్డుగా నమోదైంది. ఆ తర్వాత నుంచి ఈ షేరు అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. తాజాగా నమోదైన ఆల్ టైం కనిష్టాన్ని చూసినప్పుడు ఏకంగా 70 శాతం క్షీణించింది. దీంతో.. ఈ షేరు మార్కెట్ విలువ దాదాపు రూ.లక్ష కోట్ల వరకు ఆవిరైపోయింది. ఇటీవల కాలంలో ఇంత భారీ మొత్తం ఒక షేరు కారణంగా మదుపరులు పోగొట్టుకోవటం చాలా తక్కువంటున్నారు.

ప్రస్తుత షేరు విలువ ప్రకారం జొమాటో మార్కెట్ విలువ రూ.41వేల కోట్లుగా చెబుతున్నారు. ఈ షేరుఎందుకిలా నేల చూపులు చూస్తోంది? కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఈ సంస్థ బ్లింకిట్.. షిప్ రాకెట్.. మ్యూజిక్ పిన్ లాంటి నష్టాల్లో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టటంతో ఈ సంస్థ భవిత మీద ఆందోళన పెరుగుతోంది. స్టాక్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. జొమాటో షేరు మళ్లీ పుంజుకోవటం ఇప్పట్లో కాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. అందరికి సుపరిచితమైన బ్రాండ్ అని నమ్మి మదుపు చేసిన వారికి చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పక తప్పదు.