Begin typing your search above and press return to search.

అమరావతి బకాయిలు ఇప్పించాలని సుప్రీంలో విదేశీ సంస్థ పిటీషన్!

By:  Tupaki Desk   |   11 Aug 2022 11:51 AM GMT
అమరావతి బకాయిలు ఇప్పించాలని సుప్రీంలో విదేశీ సంస్థ పిటీషన్!
X
ఏపీ కలల రాజధాని అంటూ చంద్రబాబు తలపెట్టిన ‘అమరావతి’ అతీగతీ లేకుండా పోయింది. చంద్రబాబు దిగిపోయి జగన్ గద్దెనెక్కడంతో అమరావతి మూలనపడిపోయింది. జగన్ ‘మూడు రాజధానులను’ తెరపైకి తేవడంతో ఇక ‘అమరావతి’ నిర్మాణం అటకెక్కింది.

అయితే భారీ కాంట్రాక్టుతో అమరావతి నిర్మాణం చేపట్టిన విదేశీ సంస్థ ‘ఫోస్టర్’ తాజాగా సుప్రీంకోర్టుకు ఎక్కి ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ ఆర్బిట్రేషషన్ పిటీషన్ దాఖలు చేసింది.

ఈ పిటీషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు.. తాజాగా అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధి అథారిటీకి నోటీసులు ఇచ్చింది. ఫోస్టర్ సంస్థ పిటీషన్ పై సమాధానం చెప్పాలని ఆదేశించింది.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఫోస్టర్ సంస్థ గతంలో పనిచేసింది. రాజధాని నిర్మాణ ప్రణాళిక , భవన ఆకృతులు రూపొందించింది. తమకు రావాల్సిన సొమ్ము చెల్లించలేదని పేర్కొంది. బకాయిలపై ఏఎమ్ ఆర్డీఏకి లేఖలు, నోటీసులు పంపినా సమాధానం లేదన్న కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 2019 జూన్ తర్వాత నుంచి బకాయిలపై పలుమార్లు లేఖలు రాసినట్లు వెల్లడించింది.

ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపింది. తమకు రావాల్సిన నిధులను మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పించాలని సుప్రీంకోర్టును ఫోస్టర్ సంస్థ కోరింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీ చేసింది.

అమరావతిలో అభివృద్ధి పనులకే డబ్బులు లేవంటున్న జగన్ సర్కార్.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భఆగంగా నార్మన్ ఫోస్టర్ కు బకాయిలు చెల్లింపుపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.