Begin typing your search above and press return to search.

అయ్యో.. చివ‌ర‌కు బుట్టా రేణుక ఈ ప‌ద‌వితో స‌ర్దుకుపోయారా?

By:  Tupaki Desk   |   4 Aug 2022 4:30 PM GMT
అయ్యో.. చివ‌ర‌కు బుట్టా రేణుక ఈ ప‌ద‌వితో స‌ర్దుకుపోయారా?
X
బ‌ళ్లు ఓడ‌ల‌వ‌డం... ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం అంటే ఇదేనేమో! బుట్టా రేణుక 2014లో పారిశ్రామిక‌వేత్త‌గా, బీసీ నేత‌గా వైఎస్సార్సీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎకాయెకి దెబ్బ‌కు క‌ర్నూలు ఎంపీ సీటును కూడా కొట్టేశారు. అయితే ఇందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కు రూ.25 కోట్లు విరాళం రూపంలో స‌మ‌ర్పించుకున్నార‌ని గాసిప్స్ కూడా వినిపించాయి. ఎలాగ‌యితే ఏమీ బుట్టా రేణుక 2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా విజ‌య ఢంకా మోగించారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన బీటీ నాయుడుపై ఆమె విజ‌యం సాధించారు.

అయితే ఆ త‌ర్వాత కొద్ది కాలానికే బుట్టా రేణుక త‌న భ‌ర్త‌తో క‌లిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ మ‌హానాడుకు సైతం హాజ‌ర‌య్యారు. క‌ర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల‌, క‌ర్నూలు వైఎస్సార్సీపీ ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక ఇద్ద‌రూ టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో నాడు వైఎస్సార్సీపీ తీవ్ర షాక్ త‌గిలింది.

అయితే టీడీపీలో చేరిన‌ప్ప‌టికీ బుట్టా రేణుక‌కు ఎలాంటి ప్రాధాన్య‌త ప‌ద‌వీ ల‌భించ‌లేదు. దీంతో ఆమె గ‌త ఎన్నిక‌ల ముందు వైఎస్సార్సీపీలోకి వ‌చ్చేశారు.

అయితే ఆమెకు గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ ఎక్క‌డా సీటు కేటాయించ‌లేదు. ఇందుకు సంబంధించి ముందుగానే ఆమెకు సంకేతాలిచ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆమె కూడా సీటు అడ‌గ‌కుండా వైఎస్సార్సీపీలో స‌ర్దుకుపోయారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చాక తన‌కు ఏదో ఒక కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని ఇస్తార‌ని బుట్టా రేణుక ఆశించారు. అయితే ఆమె ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. వైఎస్సార్సీపీ గెలిచి మూడేళ్ల‌వుతున్నా బుట్టాకు ఏ ప‌ద‌వీ రాలేదు.

ఇప్పుడు ఎట్ట‌కేల‌కు క‌ర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్ష ప‌ద‌విని బుట్టా రేణుక‌కు ఇచ్చారు. ఇదేమంత గొప్ప ప‌ద‌వి కాద‌ని అంటున్నారు. ఎంపీగా, సంప‌న్న ఎంపీల్లో ఒక‌రిగా రికార్డు సృష్టించిన బుట్టా రేణుక స్థాయికి ఈ ప‌ద‌వి చాలా చిన్న‌దని చెబుతున్నారు.

క‌నీసం ఆమెకు పార్టీలో ఏదైనా రాష్ట్ర స్థాయి ప‌ద‌వి ఇచ్చినా గౌరవంగా ఉండేద‌ని అంటున్నారు. లేదా క‌ర్నూలు జిల్లా పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇచ్చినా కొంచెం గౌర‌వ‌ప్ర‌దంగా ఉండేదని చెప్పుకుంటున్నారు. అటూ ఇటూ కాకుండా వైఎస్సార్సీపీ జిల్లా మ‌హిళా అధ్య‌క్షురాలి ప‌ద‌వి ఆమె స్థాయికి త‌గింది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.