Begin typing your search above and press return to search.

దాడి మాస్టారూ...దారెటు సారూ...?

By:  Tupaki Desk   |   20 Jan 2023 12:30 PM GMT
దాడి మాస్టారూ...దారెటు సారూ...?
X
రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వారు తరువాత దశలో అది కొనసాగించలేక ఇబ్బంది పడతారు. కొన్ని సార్లు తీసుకున్న నిర్ణయాలు కాలగమనంలో కలసిరాకపోవడంతో బిగ్ ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఇపుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. ఆయన తెలుగుదేశం నుంచి వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అంటే రెండు దశాబ్దాల పాటు కొనసాగారు అన్న మాట.

ఈ మధ్యలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు అని కూడా అంటారు. 2007లో శాసనమండలి పునరుద్ధరిస్తే తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి మండలిలో ప్రతిపక్ష నేతగా కూడా క్యాబినేట్ హోదాను అనుభవించ్చారు. 2012 తరువతనే ఆయన రాజకీయ సుడి అడ్డం తిరిగింది. తనను రెండవమారు ఎమ్మెల్సీగా కంటిన్యూ చేయలేదు అన్న ఒకే ఒక్క దాంతో అలిగిన దాడి వైసీపీకి రూట్ మార్చారు. దాంతో ఆయన రాజకీయ జాతకం తారు మారు అయింది.

మళ్ళీ టీడీపీలోకి వెళ్ళాలనుకున్నా అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. నో ప్లేస్ అన్నట్లుగా ఉంది. వైసీపీలో ఉంటే టికెట్ తన కుమారుడు దాడి రత్నాకర్ కి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దాంతో దాడి మాస్టారు ఏం చేయాలో పాలుపోక సతమతం అవుతున్నారు అని అంటున్నారు. నిజానికి 2019లో దాడి వైసీపీలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ గెలుపు కోసం కృషి చేశారు. దానికి నజరానాగా తనకు ఎమ్మెల్సీ పదవి, తన కుమారుడికి మంచి నామినేటెడ్ పదవి దక్కుతాయని ఆశించారు.

కానీ నాలుగేళ్ళుగా ఏ పదవీ ఇంటి దాకా రాలేదు. దాంతో తీవ్ర అసంతృప్తితో దాడి ఉన్నారు. ఒక దశలో ఆయన జనసేనలో చేరిపోతారు అని ప్రచారం సాగింది. అయితే ఆయన వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇపుడు చూస్తే పొత్తుల ఎత్తులు అన్నీ కూడా కుదిరిపోతున్నాయి. తెలుగుదేశం జనసేన ఒక్కటిగా పోటీకి దిగుతాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో దాడి ఈ రెండు పార్టీలలోనూ చేరలేని పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.

దీనికి ముందు ఒక ముచ్చటను చెపుకోవాల్సి ఉంది. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా దాడి వీరభద్రరావు ఇంటికి వచ్చారు. తన పార్టీలో చేరమని ఆహ్వానించారు. నాడు ఆయన్ని కాదని వైసీపీలోకి దాడి జంప్ అయ్యారు. మరి ఇపుడు జనసేనలోకి వెళ్ళినా టికెట్ ఇస్తారని ఆశలేదు. పైగా నాడు పిలిస్తే వెళ్ళని ఈ మాజీ మంత్రికి జనసేనాని కూడా రెడ్ కార్పెట్ పరచి వెల్ కం చెప్పరు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే అనకాపల్లిలో దాడి ప్రభ మసకబారిందని, క్యాడర్ కూడా పెద్దగా లేదని అంటున్నారు.

అందుకే వైసీపీ కూడా పక్కన పెట్టిందని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికలలోగా దాడి తెలుగుదేశంలో చేరి లోకల్ గా ఎవరిని నిలబెట్టినా సపోర్ట్ చేసి ఎమ్మెల్సీ కోసం హామీ తెచ్చుకుంటారా లేక వైసీపీలో గమ్మున ఉంటూ వైసీపీ మళ్లీ పవర్ లోకి వస్తే పదవి కోసం చూస్తారా అన్నది చర్చగా ఉందీ. ఏది ఏమైనా దాడి మాస్టారు ఎందరికో పాఠాలూ రాజకీయ పాఠాలూ చెప్పారు కానీ తనకు ఎదురైన ప్రశ్నలకు జవాబులు రాయలేక ఫెయిల్ అవుతున్నారు అని అంటున్నారు.