Begin typing your search above and press return to search.

డియర్ రీడర్: నోట్ దిస్ పాయింట్

By:  Tupaki Desk   |   10 Nov 2015 7:30 AM GMT
డియర్ రీడర్: నోట్ దిస్ పాయింట్
X
రోజువారీగా అవసరమయ్యే చాలా అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు.. ఆ సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ. ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండటం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం. తాజాగా చోటు చేసుకున్న అలాంటి అప్ డేట్స్ లోకి వెళితే..

* ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ను ఓకే చేశారు. ఇప్పటివరకూ ఉన్న ‘‘100’’ స్థానంలో ‘‘112’’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెంబరును అన్ని రాష్ట్రాలకు అనుసంధానం చేసేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. నూతన వ్యవస్థకు అవసరమైన ఖర్చును తామే భరిస్తామని కేంద్రం వెల్లడించింది. అయితే.. అందుకు సంబంధించిన ఏర్పాట్లకు రాష్ట్రాల నుంచి సాయాన్ని అభ్యర్థించింది. దేశవ్యాప్తంగా ఈ సరికొత్త నెంబరు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎక్కడ ఉండి ‘‘112’’ నెంబరుకు ఫోన్ చేస్తే ఆపదలో ఉన్న వారి ఫోన్ నెంబరుతో.. జీపీఎస్ ఆధారంగా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి.. అధికారయంత్రాగం చేరుకొని సాయం చేసేందుకు ఈ విధానం సాయం చేస్తుంది. ఈ నెంబరు మరికొద్ది కాలంలో అమల్లోకి రానుంది.

* రైల్వే రిజర్వేషన్ల టిక్కెట్ల క్యాన్సిలేషన్ ఛార్జీలు మారుతున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో కొత్త క్యాన్సిలేషన్ ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే టిక్కెట్ల క్యాన్సిలేషన్ చేయాలంటే వెంటనే చేసేయటం మంచిది. ఇకపై.. టిక్కెట్ల బుకింగ్ కు సంబంధించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. లేదంటే.. జేబు మీద విపరీతమైన భారం పడటం ఖాయం.

* అందరూ ఎంతో ఇష్టంగా తినే గ్రిల్డ్ మాంసం ఆరోగ్యానికి ముప్పుగా తాజా అధ్యయనం తేల్చింది. వంటపాత్రలో వేయించిన.. గ్రిల్డ్ మాంసంతో మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా తేల్చారు. అధిక ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని వండినప్పుడు విడుదలయ్యే రసాయనాలు క్యాన్సర్ కు కారకంగా టెక్సాస్ కు చెందిన అధ్యయన బృందం ఒకటి తాజాగా గుర్తించింది.

* బీహార్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన లౌకిక మహాకూటమికి చెందిన జేడీయూ నేత నితీశ్ కుమార్ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారానికి ముహుర్తం నిర్ణయించారు. ఈ నెల 20న పాట్నాలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

* ప్రపంచ పెద్దన్న బరాక్ ఒబామా ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ లో చేరారు. ఆయన తన ఖాతాను తాజాగా ప్రారంభించారు. తన మొదటి పోస్టింగ్ గా.. భూమిని రక్షించాలంటూ ఓ వీడియో తీసి అప్ లోడ్ చేశారు.