Begin typing your search above and press return to search.

టీడీపీని దెబ్బతీయడమే గంటా టార్గెట్... వారందరితో వైసీపీలోకి...?

By:  Tupaki Desk   |   27 Nov 2022 10:38 AM GMT
టీడీపీని దెబ్బతీయడమే గంటా టార్గెట్... వారందరితో వైసీపీలోకి...?
X
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. రైలు జీవిత కాలం ఆలస్యం అని ఒక సామెత ఉంది. అలాగే గంటా తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడానికి అయిదేళ్ళు ఆలస్యం అయింది. నిజానికి గంటా 2019 ఎన్నికల ముందే వైసీపీలోకి చేరాల్సింది. కానీ ఆయన వ్యూహాన్ని పసిగట్టిన సన్నిహితుడు అవంతి శ్రీనివాసరావు ఆయన కంటే ముందే అన్నీ సర్దుకుని గోడ దూకేశారు.

అలా వైసీపీ వేవ్ లో ఆయన మంత్రి కూడా అయిపోయారు. మూడేళ్ల పాటు అధికార దర్జా అనుభవించారు. అయితే అంది వచ్చిన అవకాశాలను వాడుకోవడంతో గంటా మాదిరిగా అవంతి చాణక్యం చూపించలేకపోయారు. దాంతో ఆయన ప్రభ అలా మసకబారింది. ఇపుడు ఆయన అవసరం కూడా వైసీపీకి లేదు. దాంతో ఆయనని తీసి పక్కన పెట్టేశారు.

సరిగ్గా ఈ పరిణామాలే కలసి రావడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా గంటా వైసీపీలోకి వెళ్ళేందుకు తన పధక రచనను సిద్ధం చేసుకున్నారు. ఆయన డిసెంబర్ మొదటి వారంలో విశాఖకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్ సమస్ఖంలో పార్టీ మారనున్నారు. ఆయన తాను పార్టీ మారడమే కాదు, ఏకంగా మరింతమంది టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను కూడా వైసీపీలోకి తీసుకువస్తారు అని అంటున్నారు. మూడు జిల్లాలలో తనకు ఉన్న బలాన్ని ఆయన నిరూపించుకుంటారు అని అంటున్నారు.

విశాఖ జిల్లాలో చూస్తే గంటా అనుచరులు అంతా ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. ఇక విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో ఉన్న కీలక నేతలు కూడా గంటా బాట పడుతారు అని అంటున్నారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కూడా గంటా వెంట వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. అదే విధంగా చోడవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు కూడా గంటాతో పాటే వైసీపీ కండువా కప్పుకుంటారు అని అంటున్నారు.

ఇక మాజీ మంత్రులు ఉద్దండులు అయిన నాయకులు కొందరు ఉన్నారు. వారు వైసీపీలోకి వస్తారా అన్న చర్చ కూడా సాగుతుంది. వారు ఎవరంటే బొబ్బిలి రాజులుగా పేరు పడిన మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు, ఆయన తమ్ముడు బేబీ నాయన. ఇందులో బేబీ నాయన టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్నా ఆ పార్టీ అధికారంలోకి రాదు అన్న నమ్మకం కుదిరితే మాత్రం గంటా బాట పట్టేందుకు వెనుకాడరు అంటున్నారు. ఇక మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు టీడీపీలో ఇమడలేకపోతున్నారు. ఆయన కాంగ్రెస్ రాజకీయాల నుంచే వచ్చారు. జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఒకనాడు మెలిగారు.

దాంతో ఆయన కూడా వైసీపీలోకి వస్తారని టాక్ నడుస్తోంది. ఆయన వస్తే బొబ్బిలి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెబుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావు పార్టీ మారుతారా అన్న చర్చ కూడా వస్తోంది. ఆయనకు టికెట్ విషయంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి ఫ్యామిలీతో ఇబ్బందులు ఉన్నాయి. రాజాం టికెట్ విషయంలో హామీ వస్తే కచ్చితంగా మురళీమోహనరావు వైసీపీ కండువా కప్పుకుంటారు అని అంటున్నారు.

ఇక మరో కీలకమైన సీటు ఉంది. అది ఎచ్చెర్ల, ఇక్కడ సీటు కోసం మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ట్రై చేస్తున్నారు. అయితే ఆయనకు అచ్చెన్నాయుడు నుంచి వ్యతిరేకత వస్తోంది. కలిశెట్టి అప్పలనాయుడుకు ఇక్కడ టీడీపీ టికెట్ ఇస్తారని అంటున్నారు. ఇక ఎచ్చెర్లలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్మ్ మీద వ్యతిరేకత ఉంది. ఆయనను తప్పించి టికెట్ వేరే వాళ్లకు ఇవ్వాలని వైసీపీ చూస్తోంది.

కళా వెంకటరావు కనుక వైసీపీలోకి చేరితే ఆయనకు ఈ సీటు దక్కే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. గంటాకు కళా సన్నిహితుడు కావడంతో ఆయన కూడా వైసీపీ వైపు చూస్తారని ప్రచారం అయితే ఉంది. మొత్తానికి చూస్తే గంటా కనుక వైసీపీలోకి వెళ్తే ఉత్తరాంధ్రాలోని టీడీపీ కూశాలు మొత్తం కదులుతాయని అంటున్నారు. అలాగే విశాఖ సిటీలో కూడా టీడీపీకి అతి పెద్ద దెబ్బ పడుతుంది అని అంటున్నారు.