Begin typing your search above and press return to search.

కొన్ని కొన్ని అంతే ప‌వ‌న్ ముంచినా తేల్చినా స‌ర్దుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:30 PM GMT
కొన్ని కొన్ని అంతే ప‌వ‌న్ ముంచినా తేల్చినా స‌ర్దుకోవాల్సిందే
X
నేను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ‌తాను. దాప‌రికం ఎందుకు? నాకు అది చేత‌కాదు ఇదీ.. త‌ర‌చుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పేమాట‌. వ్య‌క్తిగా ఆయ‌న‌కు ఈ ల‌క్ష‌ణం ఉండొచ్చేమో! కానీ, నాయ‌కుడిగా, పార్టీకి అధినేతగా మాత్రం ఎవ‌రికైనా అంతో ఇంతో దాప‌రికం అత్యంత ముఖ్యం. కానీ, ఈ విష‌యంలోనేప‌వ‌న్ మైనస్ అవుతున్నారు. అంతో ఇంతో పార్టీ పుంజుకుంటున్న ద‌శ‌లో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు నేత‌ల‌కు ఇబ్బందిగా మారుతున్నాయి.

కొన్ని కొన్ని అంతే.. ప‌వ‌న్‌ను విస్మ‌రించ‌లేం.. అని నాయ‌కులు అనుకునే ప‌రిస్థితిని జ‌న‌సేనాని క‌ల్పించడం రాజ‌కీయంగా పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా హైద‌రాబాద్ లో మాట్లాడిన ప‌వ‌న్‌.. తాను విఫ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడిని అని తేల్చేశారు.

నిజానికి ఆయ‌న త‌ర్వాత ఎన్న‌యినా మాట్లాడి ఉండొచ్చు. కానీ, అవేవీ లెక్క‌లోకి రావ‌డం లేదు. కేవ‌లం ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చిన తొలి ప‌లుకు మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి వ‌చ్చింది.

ఇది.. వ్య‌క్తిగ‌తంగా ప‌వ‌న్‌ను బాధించే విష‌యం కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే.. త‌నకంటూ ఒక వేదిక ఉంది. త‌న‌కంటూ ఒక రాబ‌డి కూడా ఉంది. కానీ, త‌న‌నే న‌మ్ముకున్న నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి? పార్టీని న‌మ్ముకున్న నేత‌ల స్థితి ఏంటి? అనే కోణంలో చూస్తే.. అధినేతే అలా మాట్లాడితే.. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ప‌ల్టీలు కొట్టిన నాయ‌కులు ఏం చెప్పాలి? అనేది కీల‌కం. పైగా.. త‌న‌కు సుదీర్ఘ ల‌క్ష్యం ఉంద‌ని చెప్ప‌డం ద్వారా 2024 ఎన్నిక‌ల‌ను ప‌వ‌న్ లైట్ తీసుకున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ప‌వ‌న్ వ‌స్తారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటారు.. అని ఎదురు చూసిన ఆయ‌న సామాజిక వ‌ర్గం కానీ, యువ‌త కానీ, తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌తో డీలా ప‌డ్డార‌నేది వాస్త‌వం. పైగా.. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా.. విమ‌ర్శ‌ల బాణాలు సంధిస్తున్న వైసీపీకి ఇది మరింత అందివ‌చ్చింది.

రేపు.. ప‌వ‌న్‌ను విఫ‌లమైన నాయ‌కుడిగానే వైసీపీ ప్ర‌మోట్ చేయ‌నుంది. దీనివ‌ల్ల ఆయ‌న సాధించేది లేక‌పోగా.. ఉన్న‌నేత‌ల‌ను కూడా రోడ్డున ప‌డేసిన‌ట్టే అవుతుంద‌నేది విశ్లేష‌కుల భావ‌న‌. అయినా.. ఆయ‌న అంతే.. విస్మ‌రించ‌లేం.. అని స‌రిపెట్టుకోవ‌డం త‌ప్ప నాయ‌కులు చేసేది ఏమీ క‌నిపించ‌డం లేదు.