Begin typing your search above and press return to search.

రాజ‌కీయ పార్టీ పెట్టేసిన ఆ ప్ర‌ముఖ హీరో

By:  Tupaki Desk   |   31 Oct 2017 8:22 AM GMT
రాజ‌కీయ పార్టీ పెట్టేసిన ఆ ప్ర‌ముఖ హీరో
X
సినిమావాళ్లు రాజ‌కీయ పార్టీలు పెట్ట‌టం మామూలే. అయితే.. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే స‌మ‌యంలో టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. శాండిల్ వుడ్ కు చెందిన సినీ ప్ర‌ముఖులు రాజ‌కీయ పార్టీ పెట్టే దిశ‌గా అడుగులు వేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కొద్దిరోజుల క్రితం తాను రాజ‌కీయ పార్టీ పెట్ట‌నున్న‌ట్లుగా క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

చెప్పిన‌ట్లే.. ఆయ‌న ఈ రోజు త‌న పార్టీని ప్రారంభించారు. క‌ర్ణాట‌క ప్రాజ్ఞవంత్ జనతా పక్ష పేరిట ఆయ‌న త‌న రాజ‌కీయ పార్టీని ప్రారంభించారు. త‌న పార్టీని పొట్టిగా కేపీజేపీగా వెల్ల‌డించారు. బెంగ‌ళూరులోని గాంధీ భ‌వ‌న్ లో త‌న పార్టీని ఉపేంద్ర ఆవిష్క‌రించారు. త‌మది కేవ‌లం పార్టీ మాత్ర‌మే కాద‌ని.. ప్ర‌జ‌ల కోసం త‌మ పార్టీని పెట్టిన‌ట్లుగా చెప్పారు.

తాను ప్ర‌జ‌ల కోసం ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేశాన‌ని.. ఆస‌క్తి ఉన్న వారంతా పార్టీలో చేరాల‌ని.. మార్పు తేవ‌ట‌మే త‌న స్వ‌ప్నంగా ఆయ‌న వెల్ల‌డించారు.

భిన్న‌మైన న‌టుడిగా క్రేజ్ ఉన్న ఉపేంద్ర.. రాజ‌కీయ పార్టీ పెట్ట‌టం ద్వారా రాష్ట్రంలో కొత్త సంద‌డి తీసుకొచ్చార‌ని చెప్పాలి. ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా అవ‌స‌ర‌మ‌య్యే వాటి మీద త‌మ పార్టీ దృష్టిసారిస్తుంద‌న్నారు. విద్య‌.. అంద‌రికి ఆరోగ్యం..బీమా లాంటి మౌలిక స‌దుపాయాలు.. చిన్న గ్రామాల్లో వ్య‌వ‌సాయ అభివృద్ధి.. ప‌రిశ్ర‌మ‌ల్ని ప్రోత్స‌హించ‌టం లాంటి వాటితో పాటు లోక‌ల్ టాలెంట్ ను ప్రోత్స‌హించ‌టం త‌న ప్రాధాన్య‌తా అంశాలుగా చెప్పారు.

పార్టీ వెబ్ సైట్ ను న‌వంబ‌రు 10న ప్రారంభిస్తామ‌ని.. స‌మాజాన్ని.. క‌ర్ణాట‌క రాష్ట్రాన్ని ఎలా మెరుగుప‌ర్చాలో తెలుపుతూ త‌మ ఆలోచ‌న‌ల్ని వెబ్ సైట్ లో వెల్ల‌డించాల‌ని కోరారు. 2018లో జ‌రిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుంద‌ని.. ఎన్నిక‌ల‌కు ఇంకా ఆరు నెల‌లే స‌మ‌యం ఉంద‌ని.. ఈ త‌క్కువ వ్య‌వ‌ధిలో గెలుపు సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని..కానీ మార్పు తీసుకురావ‌టం త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. పార్టీలో చేరే వారికి సంబంధించిన చ‌ర్చ‌లుపూర్తి అయిన వెంట‌నే పార్టీకి సంబంధించిన మిగిలిన వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.