Begin typing your search above and press return to search.

హీరో పార్టీ పోటీలో ఉంది కానీ.. డమ్మీలే!

By:  Tupaki Desk   |   28 March 2019 6:35 AM GMT
హీరో పార్టీ పోటీలో ఉంది కానీ.. డమ్మీలే!
X
రాజకీయంలోకి ఎంట్రీ విషయంలో మొదట్లో తప్పటడుగులు వేసిన ఉపేంద్ర ఈ సారి అయితే తన పార్టీని ఎన్నికల బరిలో నిలుపుతూ ఉన్నాడు. ముందుగా ఈయన ఒక పార్టీని స్థాపించారు. ఆటో గుర్తును కూడా వెనువెంటనే తెచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనే తన పార్టీ పోటీ చేస్తుందని అప్పట్లో హడావుడి చేశారు. ఖాకీ చొక్కాలు వేసుకుని హడావుడి చేశారు.

కట్ చేస్తే.. ఆ పార్టీ నుంచి అతి తక్కువ రోజుల్లోనే ఉపేంద్ర బయటకు వచ్చాడు! తను స్థాపించిన పార్టీకి తనే రాజీనామా చేసి బయటకు వచ్చాడు ఉప్పీ. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపేంద్ర పార్టీ పోటీ చేయలేకపోయింది. ఆ తర్వాత ఉపేంద్ర మరో రాజకీయ పార్టీని స్థాపించారు. దాన్ని ఈ సారి పోటీలో పెట్టడం ఖాయమని ఇది వరకే ప్రకటించారు. ఆ మేరకు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఉపేంద్ర పార్టీ కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది.

ప్రకటించడం అయితే జరిగింది కానీ… ఉపేంద్ర పార్టీకి అంత ఊపు కనిపించడం లేదు. ఉపేంద్ర పార్టీ పెట్టాడు అనగానే కర్ణాటక ఏమీ ఊగిపోలేదు. ఉపేంద్రకు కర్ణాటకలో ఫ్యాన్ ఫాలోయింగ్ కొంత వరకూ ఉంది కానీ..అది రాజకీయంగా పనికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఇది వరకూ కర్ణాటకలో ఇలా హీరోలు ప్రాంతీయ పార్టీలు పెట్టేసి రాణించిన దాఖాలు లేవు. అంబరీష్ వంటి స్టార్ హీరో కూడా.. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయంగా కొంత రాణించారు. మండ్య ప్రాంతంలో తన సామాజికవర్గం సమీకరణాలు అనుకూలంగా ఉండటంతో అక్కడ అంబరీష్ రాణించగలిగారు అనేది సత్యమే.

అయితే ఉపేంద్ర మాత్రం ఏకంగా ప్రాంతీయ పార్టీ అంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో రాజకీయ శూన్యత ఏమీ లేదు. కులాల వారీగా పార్టీలు అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నాయి. వక్కలిగలకు జేడీఎస్, లింగాయత్ లకు బీజేపీ, ఎస్సీలు, మైనారిటీలకు కాంగ్రెస్.. ఇతరులూ అటూ ఇటూ.. అనే రాజకీయం నడుస్తోందక్కడ. వాటి మధ్యన ఉపేంద్ర పార్టీ నలిగిపోయే అవకాశాలున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.