Begin typing your search above and press return to search.

అధికార పార్టీ అగ్ర‌జుడికి కాలిపోయింది

By:  Tupaki Desk   |   15 Dec 2016 10:25 AM GMT
అధికార పార్టీ అగ్ర‌జుడికి కాలిపోయింది
X
బీజేపీ అగ్ర‌నేత‌ - సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ ఎల్‌ కే అద్వానీ మ‌రోమారు త‌న అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏకంగా త‌న ఎంపీ ప‌ద‌వికే రాజీనామా చేస్తాన‌ని క్లారిటీ ఇచ్చారు. అది కూడా అధికార పార్టీ తీరును ప‌రోక్షంగా త‌ప్పుప‌డుతూ కావ‌డం గ‌మ‌నార్హం. కొద్దికాలంగా పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే లోక్‌ స‌భ‌లోనే పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. స్పీక‌ర్‌ను కూడా క‌లిసి త‌న అసంతృప్తిని వ్య‌క్తంచేశారు. అయినా స‌భ‌లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతుండ‌టంపై అద్వానీ ఆవేదన చెందుతున్నారు.

ప్ర‌స్తుత రీతిలోనే పార్ల‌మెంటు స‌మావేశాలు కొన‌సాగితే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని బీజేపీ ఎంపీల‌తో అద్వానీ పేర్కొన్న‌ట్లు స‌మాచారం. "స‌భ‌లో ఎవ‌రు గెలుస్తున్నారో ఎవ‌రు ఓడుతున్నారోగానీ.. చివ‌రికి స‌భ మాత్రం ఓడిపోతోంది" అని అద్వానీ ఆవేద‌న వ్య‌క్తంచేసిన‌ట్లు టీఎంసీ ఎంపీ ఇద్రిస్ అలీ వెల్ల‌డించారు. ఈ స‌మ‌యంలో వాజ్‌ పేయి స‌భ‌లో ఉండి ఉంటే చాలా బాధ ప‌డేవార‌ని అద్వానీ అన్నార‌ని అలీ మీడియాతో చెప్పారు. "మీ ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగితే.. నా ఆరోగ్యం బాగానే ఉందిగానీ.. స‌భ ఆరోగ్యమే బాగాలేదు" అని అద్వానీ అన్న‌ట్లు అలీ తెలిపారు. గ‌తంలో స‌భ‌లో ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితి చూడ‌లేదని, త‌న‌కు రాజీనామా చేయాల‌నిపిస్తున్న‌ట్లు అద్వానీ చెప్పార‌ని ఇద్రిస్ వివ‌రించారు.

కాగా ఈ రోజు సైతం లోక్ స‌భ‌ - రాజ్య‌స‌భ స‌మావేశాలు మ‌రుస‌టి రోజుకు వాయిదా ప‌డ్డాయి. సభ ప్రారంభం అనంతరం ఐదు నిమిషాలకే సభా సమావేశం వాయిదాపడింది. సభ తిరిగి ప్రారంభమైన అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభా వ్యవహారాలు సజావుగా జరిగే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ సభ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై లోక్‌ సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే మాట్లాడటానికి లేవగా అధికార సభ్యులు ఆందోళనలు చేపట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సభలో మేం చర్చను కోరుతుంటే అధికార బీజేపీ సభ్యులు మాత్రం ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్షం నోట్ల రద్దుపై చర్చించాల్సిందిగా పట్టుబడుతుంటే పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్ కుమార్ మాత్రం అగస్టా వెస్ట్‌ల్యాండ్ అంశంపై చర్చించాలంటున్నరు. అధికార సభ్యుల తీరు సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. ఇలా వాదోప‌వాదాల మ‌ధ్య లోక్ స‌భ వాయిదాప‌డింది. ఆ కొద్ది సేప‌టికే రాజ్య‌స‌భ సైతం వాయిదా ప‌డింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/