Begin typing your search above and press return to search.

మోడీ ఆయ‌న్ను ఎంత తొక్కేశారో తేలిపోయింది

By:  Tupaki Desk   |   17 Feb 2017 12:14 PM GMT
మోడీ ఆయ‌న్ను ఎంత తొక్కేశారో తేలిపోయింది
X
మ‌న‌దేశంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించిన పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో మ‌రో సంచ‌ల‌న విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌వేశపెట్టిన కొత్త 2000 నోటు ముద్ర‌ణ విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యం తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఈ నోట్ల ముద్ర‌ణ గ‌తేడాది ఆగ‌స్ట్ 22న మొద‌లైన‌ట్లు ఆర్బీఐ వ‌ర్గాలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అంటే ఆర్బీఐ త‌ర్వాతి గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ అని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజు. అయితే ఆర్బీఐ ర‌థ‌సార‌థిగా ఉర్జిత్ పేరు ఖ‌రారైంది కానీ ఆయ‌న రెండు వారాల త‌ర్వాత బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ముద్ర‌ణ మొద‌ల‌య్యే స‌మ‌యానికి రఘురాం రాజ‌నే గ‌వ‌ర్న‌ర్‌ గా ఉన్నా.. 2000 నోటుపై ఆయ‌న సంతకం లేదు. ఈ విష‌యంలో అంద‌రికీ సందేహం నెల‌కొంది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అసంతృప్తితో ఉంద‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూర్చే విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జాతీయ ప‌త్రిక హిందుస్థాన్ టైమ్స్ జ‌రిపిన ఆప‌రేష‌న్‌ లో ఈ ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌యం వెల్ల‌డైంది. రాజ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ గా ఉన్న స‌మ‌యంలోనే ఉర్జిత్ సంతకంతో 2000 నోటు ముద్ర‌ణ మొద‌లైన‌ట్లు మాత్రం స్ప‌ష్ట‌మైంది. 2000 నోట్ల ముద్ర‌ణ‌కు జూన్‌ లోనే త‌మ‌కు అనుమతి ల‌భించింద‌ని గ‌తేడాది డిసెంబ‌ర్‌ లో పార్ల‌మెంట‌రీ ప్యానెల్ ఆన్ ఫైనాన్స్‌ కు ఆర్బీఐ వివ‌ర‌ణ ఇచ్చింది. సాధార‌ణంగా అనుమ‌తి రాగానే కొత్త నోట్ల ముద్ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది. కానీ ఇక్క‌డ మాత్రం రెండున్న‌ర నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఇక్క‌డే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికి నోట్ల ర‌ద్దు, 2000 నోటు ముద్ర‌ణ‌పై రాజ‌న్ ఎక్క‌డా స్పందించ‌లేదు. వీటిని వ్య‌తిరేకించ‌డం వ‌ల్లే రాజ‌న్ ప‌ద‌వీకాల‌న్ని కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పొడిగించ‌లేద‌న్న అనుమానాల‌కు ఇవి బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. ఇదే విష‌య‌మై ఆర్బీఐ వివ‌ర‌ణ తీసుకోవ‌డానికి ఆ ప‌త్రిక ప్ర‌య‌త్నించినా.. ఏ స‌మాధానం రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అటు ర‌ఘురాం రాజ‌న్‌ కు కూడా ఇదే ప్ర‌శ్న‌లు మెయిల్ చేసినా అక్క‌డి నుంచి కూడా ఎలాంటి స్పంద‌న లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/