Begin typing your search above and press return to search.

ఏసీలో కూర్చొని ట్వీట్లు చేసే నేతను కాదు : ఊర్మిళ

By:  Tupaki Desk   |   24 Dec 2020 2:59 PM GMT
ఏసీలో కూర్చొని ట్వీట్లు చేసే నేతను కాదు : ఊర్మిళ
X
‘ఏసీ గదిలో కూర్చొని ట్వీట్లు చేసే నాయకురాలిగా మారడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను శివసేనలో చేరాను’ అని అన్నారు ప్రముఖ సినీనటి ఉర్మిళా మటోండ్కర్. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి శివసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

ప్రజల నాయకురాలిగా మారాలన్నదే తన ఉద్ధేశం అని అన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రజల కోసం తాను పనిచేస్తానని అంటోంది మటోండ్కర్. కాంగ్రెస్ పార్టీతో తనకున్న స్వల్పకాలిక అనుబంధానికి చింతిస్తున్నానని ఉర్మిళా వ్యాఖ్యానించారు.

గత ఏడాది జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేసి ఓడిపోయాక కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనను విమర్శిస్తూ ఉర్మిళా పార్టీ అధిష్ఠానవర్గానికి లేఖ రాశారు. కాంగ్రెస్ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయానికి ఎన్నికల ఓటమితో సంబంధం లేదని తన మనసాక్షి ముఖ్యమని ఉర్మిళా చెప్పారు. కాంగ్రెస్ తీరు నచ్చకనే.. తాను మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ కోటాలో కాంగ్రెస్ సీటు ఇవ్వడాన్ని తాను తిరస్కరించానని మటోండ్కర్ చెప్పారు. తర్వాత ఉర్మిళను ఎమ్మెల్సీగా శివసేన సర్కారు సిఫారసు చేస్తూ గవర్నరు భగత్ సింగ్ కోష్యారికి జాబితాను పంపించింది.

శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏడాది కాలంగా బాగా పనిచేస్తుందని చెప్పారు. కొవిడ్-19తోపాటు ప్రకృతి వైపరీత్యాలను ఉద్ధవ్ సర్కారు సమర్ధంగా ఎదుర్కొందని ఉర్మిళా వివరించారు. తాను పదవిలో ఉన్నా, లేకున్నా శివసేన కోసం కృషి చేస్తానని ఉర్మిళా మటోండ్కర్ వివరించారు.