Begin typing your search above and press return to search.

శ్వేత సౌధం కథలు.. అధినేత వెతలు!

By:  Tupaki Desk   |   17 Jan 2021 11:52 AM GMT
శ్వేత సౌధం కథలు.. అధినేత వెతలు!
X
మన దగ్గర ప్రథమ పౌరుడి నుంచి.. ఒక ఎమ్మెల్యే వరకూ ఎన్ని సౌలభ్యాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి ప్రభుత్వం ఎన్ని రాయితీలు కల్పిస్తుందో కూడా తెలుసు. ఒక్క మనదగ్గర ఏమిటీ..? దాదాపు ప్రపంచంలోని అన్నిదేశాల్లోనూ ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే పరిమితుల్లో తేడా ఉంటుంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారంతా ప్రజాసేవలో ఉన్నట్టే కాబట్టి.. ప్రజాధనం నుంచి చెల్లింపులు చేస్తూ ఆ వెసులుబాటు కల్పిస్తారు. అలాంటిది ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికన్ అధినేతకు ఇంకెలాంటి వసతులు ఉంటాయో కదా?! శ్వేత సౌధంలో దేశాధ్యక్షుడు అనుభవించే రాజభోగాలు ఏ రీతిలో కొనసాగుతాయో కదా!! వైట్ హౌస్ సాంప్రదాయం గురించి తెలియని వాళ్లు ఈ ప్రశ్నలకు ఎన్నెన్ని సమాధానాలు చెపుతారో ఊహించగలం కానీ.. అమెరికా అధ్యక్షుడు ఆన్సర్ ఇస్తే మాత్రం అందరూ ముక్కున వేలేసుకోవడం తథ్యం! ఇక ఆయన కుటుంబ సభ్యులైతే ఆవేదనను పంటి బిగువున భరిస్తారంటే అతిశయోక్తి కాదు.

అధ్యక్షుడి జేబుకు అన్నీ చిల్లులే..!
ఉదయాన్నే బ్రష్ పై పెట్టుకునే పేస్టు మొదలు.. రాత్రి చేసే డిన్నర్ వరకూ.. ఒంటికి వేసుకునే కోటు నుంచి.. దానిపై రాసుకొనే సెంటు దాకా.. అధ్యక్షుడి సొంతానికయ్యే ప్రతీ రూపాయికీ బిల్లు పడుతూనే ఉంటుంది. ఈ అగ్రరాజ్య అధ్యక్షుడు ఏదైనా కొనుగోలు చేయొచ్చు.. ఎంతైనా ఖర్చు చేయొచ్చు.. పేమెంట్ మాత్రం ఆయన జేబులో నుంచే కట్ అవుతుంది!

అవునా..?!
అవును నిజమే.. పైన చెప్పుకున్నదంతా వైట్ హౌస్ సాక్షిగా వందకు వంద శాతం నిజం. అయితే.. ఇదంతా రాజ్యాంగంలో రాసుకున్నదేమీ కాదు. రెండో అధ్యక్షుడు అనివార్య పరిస్థితుల్లో మొదలు పెట్టిన ఈ సాంప్రదాయం.. నేటికీ కొనసాగుతోంది. అధ్యక్షుల కుటుంబ సభ్యులతో కన్నీళ్లు కూడా పెట్టిస్తోంది పాపం.

ఎప్పట్నుంచీ?
ఈ విధానం అమెరికా రెండో అధ్యక్షుడి కాలం నుంచే మొదలైంది. తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ హయాంలో వైట్ హౌస్ నిర్మాణం ప్రారంభమైంది. అయితే.. అది పూర్తయ్యే సరికి ఆయన పదవీకాలం పూర్తయిపోయింది. దీంతో.. రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ శ్వేతసౌధంలోకి ‘తొలి అధినేత’గా ఎంట్రీ ఇచ్చారు. తొలినాళ్లు కావడంతో అధ్యక్షుడికి సిబ్బంది కేటాయింపు, ఆయన అవసరాలు, వాటికి సంబంధించిన ఖర్చుల గురించి ప్రత్యేక నియామకాలు జరగలేదు. దీంతో.. తన ఖర్చులన్నింటినీ సొంతంగానే భరించారు ఆడమ్స్. అలా మొదలైన సాంప్రదాయం.. ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది.

జీతం ఎంతిస్తారు?
అమెరికా అధ్యక్షుడికి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు 2.93 కోట్ల వేతనం లభిస్తుంది. దీంతోపాటు సుమారు మరో రూ.36 లక్షల వరకు ఇతర అలవెన్సుల కోసం చెల్లిస్తారు. ఈ లెక్కన నెలకు దాదాపు మూడు కోట్ల రూపాయల జీతం వస్తోందంటే.. ఫర్వాలేదులే ఖర్చులన్నీ భరించొచ్చు అనుకుంటున్నారేమో! కానీ.. ఆ అంచనా శుద్ధ తప్పు. మనం ఖరీదైన ఇల్లు రెంట్ కు తీసుకుంటే.. మెయింటెనెన్స్ ఛార్జీలు చూసి కళ్లు తేలేస్తాం కదా.. వైట్ హౌస్ పరిస్థితి అంతకు వంద రెట్లు ఉంటుంది! మన దగ్గర ఓ ఫేమస్ సామెత ఉంటుంది కదా.. ‘అయ్య గారి సంపాదన.. అమ్మగారి బొట్టు బిళ్లలకు సరిపోవట్లేద’ని. అచ్చం అలాగే ఉంటుంది అగ్రరాజ్య అధినేత పరిస్థితి!

మినహాయింపులేమీ ఉండవా?
అధ్యక్షుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాల క్రమంలో కొంత వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. దీని ప్రకారం.. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ లో నివసిస్తున్నందుకు అద్దె ఇవ్వక్కర్లేదని కరుణించింది! అధినేతకు వంట మనిషి కూడా లేకుంటే బాగుండదు కాబట్టి, వంట మనిషి జీతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక, రాజ్యాధినేత ఆరోగ్యం దేశానికి అవసరం కాబట్టి ఆయన హెల్త్ ఖర్చులను కూడా సర్కారు ఖజానా నుంచి చెల్లిస్తుంది. వీటన్నింటికన్నా ప్రెసిడెంట్ రక్షణ ముఖ్యం కాబట్టి.. ఆయన సెక్యూరిటీ, ఇతర సిబ్బంది వేతనం కూడా ప్రభుత్వం చెల్లిస్తుందన్నమాట.

ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదా?
అమెరికా ప్రజాస్వామ్యపు వయసు సుమారు 220 సంవత్సరాలు. ఇప్పటి వరకూ 45 మంది దేశాధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో తొలి అధ్యక్షుడు తప్ప, అందరూ శ్వేత సౌధంలో నివాసం ఉన్నవారే. అయితే.. అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉండి ప్రతీ రూపాయి సొంత ఖాతానుంచే చెల్లించుకోవాల్సి రావడంపై సామాన్య ప్రజలెవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ.. వారి కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా వారి వారి సతీమణులు ఆక్షేపించారు. ఈ పద్ధతి మారాలని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎవరెెవరు..?
1981లో అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ వైట్ హౌస్ కు వెళ్లారు. ఆయన వెళ్లిన నెల రోజులకే రీగన్ భార్య నాన్సీ రీగన్ ఈ తీరుపై గోడు వెళ్లబోసుకున్నారు. తినే తిండి మొదలు.. సబ్బు, పేస్టులకు కూడా బిల్లు వేయడం అన్యాయమన్న ఆమె.. ఈ విషయం తమకు ముందుగా చెప్పలేదంటూ వాపోయారు. ఆ తర్వాత జార్జిబుష్ జూనియర్ వైఫ్ లారా బుష్, క్లింటన్ భాగస్వామి హిల్లరీ, ఒబామా అర్ధాంగి మిషెల్ కూడా ఈ రీతిన ఆవేదన వ్యక్తంచేశారు.

అప్పులతో బయటకు..!
వైట్ హౌస్ లోకి వెళ్లిన ప్రతీ అధ్యక్షుడు.. తన పదవీకాలం ముగిసి తిరిగి వెళ్లిపోయేప్పుడు అప్పులతోనే వెనుదిరుగుతాడనే నానుడి ఉంది అమెరికాలో! అంటే.. శ్వేతసౌధంలో ఖర్చుల తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కోణంలో చూస్తే.. అమెరికా అధ్యక్షుడిగా ఎదురయ్యే రాజకీయ సవాళ్లను అధిగమించడం ఒకెత్తయితే.. వైట్ హౌస్ లో జేబు భద్రంగా ఉంచుకోవడం మరొక ఎత్తు అనిపిస్తోంది కదూ..!