Begin typing your search above and press return to search.

అఫ్గన్‌కు అమెరికా సాయం..మానవతాసాయానికి హామీ. !

By:  Tupaki Desk   |   11 Oct 2021 10:02 AM GMT
అఫ్గన్‌కు అమెరికా సాయం..మానవతాసాయానికి హామీ.  !
X
అఫ్గనిస్థాన్‌ కు మానవతా సాయం అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చినట్టు తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. అఫ్గన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత తొలిసారిగా ఖతార్ రాజధాని దోహా వేదికగా రెండు రోజుల పాటు తాలిబన్లు, అగ్రరాజ్య ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు అర్ధవంతంగా జరిగాయని తాలిబన్ మంత్రి వెల్లడించారు. మానవతా సాయం అందజేయడానికి అమెరికా అంగీకరించిందన్న ఆయన, తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి, సాయానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. కాగా, ఈ చర్చలపై స్పందించిన అమెరికా.. ఇవి ఏ విధంగానూ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తింపునకు ముందుమాట కాదని స్పష్టం చేసింది. ఇక, మానవతా సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిపింది.

అయినప్పటికీ, ఈ సమస్య గురించి మాత్రమే చర్చించామని, ఏదైనా సహాయం అఫ్గన్ ప్రజలకు అందజేస్తా మని, తాలిబాన్ ప్రభుత్వానికి కాదని అమెరికా వివరణ ఇచ్చింది. అఫ్గన్లకు మానవతా సహాయం అందిస్తామని, ఇతర మానవతా సంస్థలకు సాయం అందించేందుకు సౌకర్యాలు కల్పిస్తామని అమెరికా ప్రతినిధులు పేర్కొన్నారు.. ఈ సాయంలో ఎటువంటి రాజకీయ అంశాలకు సంబంధం లేదన్నారు' అని తాలిబన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక, ఐఎస్ ఉగ్రవాదులను తుదముట్టించడానికి అమెరికా సహాయం తీసుకునే ప్రసక్తేలేదని తాలిబన్లు తేల్చి చెప్పారు. వారిని ఎదుర్కొనే సత్తా తమకుందని పేర్కొన్నారు.

ముఖాముఖి చర్చల సందర్భంగా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాను తాలిబన్లు హెచ్చరించారు. చర్చల అనంతరం అఫ్గన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ మాట్లాడుతూ.. 'అఫ్గన్‌ లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే ఏ ఒక్కరికీ మంచిది కాదని స్పష్టం చెప్పామని' తెలిపారు. 'అఫ్గనిస్థాన్‌ తో మంచి సంబంధాలు అందరికీ మంచింది.. అఫ్గన్‌లో ఇప్పటికే ఉన్న ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే అది ప్రజా సమస్యలకు దారితీస్తుంది' అని హెచ్చరించారు. ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికా, తాలిబన్ తాత్కాలిక ప్రతినిధుల మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి.