Begin typing your search above and press return to search.

భారత్ కు అండగా అమెరికా సీఈవోలు

By:  Tupaki Desk   |   27 April 2021 12:30 PM GMT
భారత్ కు అండగా అమెరికా సీఈవోలు
X
వాళ్లంతా భారత్ లో చదువుకొని.. భారత్ లో ఎదిగి.. భారత్ వల్లే ఇప్పుడు అత్యున్నత హోదాలో ఉన్నారు. అందుకే మాతృదేశం కోసం నడుం బిగించారు. అమెరికాలో దిగ్గజ కంపెనీలను సారథ్యం వహిస్తున్న ప్రవాస భారతీయులు ఇప్పుడు మాతృదేశం కరోనాతో అల్లాడుతుంటే ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

తాజాగా అమెరికాలోని వాణిజ్యవర్గాలు భారత్ కు సాయం చేసేందుకు ఏకమవ్వడం సంచలనమైంది. అమెరికాలోని దాదాపు 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చి ఒక టాస్క్ ఫోర్స్ గా ఏర్పడి కరోనాతో అల్లాడుతున్న భారత్ కు సహకారం అందించాలని నిర్ణయించాయి. దీన్ని అమెరికా-భారత వాణిజ్య సంఘాలు పర్యవేక్షిస్తున్నాయి.

సోమవారం సమావేశమైన వీరంతా కొన్ని వారాల్లోనే భారత్ కు 20వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు డెలాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ తెలిపారు. రానున్న రోజుల్లో కీలక వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సహా ఇతర కీలక సరఫరాలను భారత్ కు అందజేయనున్నట్లు టాస్క్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి.

ఈ వారంలో 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్ కు పంపనున్నట్లు డెలాయిట్ సీఈవో తెలిపారు. మే 5 నాటికి ఆ సంఖ్య 11వేలకు పెంచుతామన్నారు. మొత్తం 25వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్ కు పంపతామని టాస్క్ ఫోర్స్ తరుఫున ప్రకటించారు. అంతకుమించి కూడా పంపుతామని.. 10 లీటర్లు, 45 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు కూడా కిట్లు పంపుతామని నిర్ణయించారు.

ఓ దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని రూపుమాపేందుకు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ వర్గాలు టాస్క్ ఫోర్స్ గా ఏర్పడడం ఇదే తొలిసారని అమెరికా విదేశాంగ మంత్రి టోని బ్రింకెన్ అభిప్రాయపడడం విశేషం.

ఇప్పటికే టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు.. ప్రవాస భారతీయులైన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లలు భారత్ కు సాయం ప్రకటించారు. వివిధ సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మరిన్ని కంపెనీలు కూడా అమెరికా నుంచి ముందుకు రావడం విశేషం. వీటిలో మెజార్టీ భారతీయుల సారథ్యంలో కొనసాగుతున్నవే కావడం విశేషం. దేశం దాటిపోయినా వారి మాతృదేశంపై ప్రేమను ఇలా ప్రవాసులు చాటుకుంటున్నారు.