Begin typing your search above and press return to search.

అమెరికా పౌర‌స‌త్వం,..రెండో స్థానంలో మ‌నోళ్లు

By:  Tupaki Desk   |   1 Dec 2017 6:58 AM GMT
అమెరికా పౌర‌స‌త్వం,..రెండో స్థానంలో మ‌నోళ్లు
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రోమారు భార‌తీయులు త‌మ ముద్ర వేసుకున్నారు. అమెరికా పౌర‌స‌త్వం పొందినవారిలో భార‌తీయులు రెండో స్థానంలో నిలిచారు. అగ్ర‌రాజ్యం పొరుగున ఉన్న‌ మెక్సిక‌న్లు స‌హ‌జంగానే ప్ర‌థ‌మ‌స్థానంలో ఉన్నారు. యూఎస్ డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యురిటీ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం 2016 ఆర్థిక సంవ‌త్స‌రం (అక్టోబ‌ర్ 1 2015 నుంచి సెప్టెంబ‌ర్ 30 2016వ‌ర‌కు) అమెరికా ప్ర‌భుత్వంచే దేశ పౌర‌స‌త్వం పొందిన 7.53 ల‌క్ష‌ల మందిలో భార‌తీయులు 6% ఉన్నారు.

అమెరికా పౌర‌స‌త్వం క‌ట్టబెట్ట‌డంలో ప్ర‌తి ఏటా స్ప‌ష్ట‌మైన క్షీణ‌త క‌నిపిస్తోంద‌ని నిపుణులు చెప్తున్నారు. మ‌రోవైపు మెక్సిక‌న్ల వ‌ల‌స‌లో కూడా నెగ‌టివ్ వృద్ధి ఉందంటున్నారు. ఇటీవ‌లి కాలంలో అమెరికా పౌర‌స‌త్వం పొంద‌డం క‌ఠినంగా మారింద‌ని ఇమ్మిగ్రేష‌న్ నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత లోతైన ప‌రిశీల‌న - అసాధార‌ణ‌మైన రీతిలో తిర‌స్క‌ర‌ణ‌లు ఉండ‌టం త‌ర‌చుగా క‌నిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. అదే స‌మ‌యంలో వ‌ర్క్ వీసాల విష‌యంలో ఉన్న అస్ప‌ష్ట‌త కార‌ణంగా కూడా ద‌ర‌ఖాస్తుల్లో స్ప‌ష్ట‌మైన మార్పు ఉంద‌ని పేర్కొన్నారు. యూఎస్ హోంల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్‌ మెంట్ అమెరికా పౌర‌స‌త్వం కోసం చేసుకున్న ద‌ర‌ఖాస్తుదారుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 9.72 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు అమెరికా పౌర‌స‌త్వం కోసం వ‌చ్చాయి. ఈమేర‌కు 24% వృద్ధి క‌నిపించింద‌ని వారు వెల్ల‌డించారు. 2015లో 7.83 లక్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. కాగా ఇది 2014 కంటే కేవ‌లం ఒక్క‌శాతం మాత్ర‌మే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

స‌హ‌జంగా అమెరికాలో గ్రీన్‌ కార్డు క‌లిగి ఉన్న‌వారికి అక్క‌డ నివ‌సించేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు అనుమ‌తి ఉంటుంది. అయితే ఇటీవ‌లి కాలంలో అమెరిక‌న్ల‌కే ఉద్యోగాలు అనే దోర‌ణి పెరిగిపోవ‌డం, వీసా విధానాల్లో ఉన్న అస్ప‌ష్ట‌త కార‌ణంగా పౌర‌స‌త్వం (హోంల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్‌ మెంట్ పేర్కొన్న ప్ర‌కారం న్యాచుర‌లైజేష‌న్‌) కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిపోతోంది.

ఈ ప‌రిణామంపై ఆసియ‌న్ అమెరిక‌న్‌ అడ్వాన్సింగ్ జ‌స్టిస్ అధ్య‌క్షుడు జాన్ సీ యంగ్ మాట్లాడుతూ `ఇత‌ర దేశాల వారి వ‌లే భార‌తీయులు అమెరికా పౌర‌స‌త్వం యొక్క విశిష్ట‌త‌ను గుర్తించారు. పౌర‌స‌త్వం క‌లిగి ఉండ‌టం వ‌ల్ల క‌లిగి ఉండే హ‌క్కులు - ఇత‌ర‌త్రా ర‌క్ష‌ణ ప‌ర‌మైన అంశాలు - ఉద్యోగాల ప‌రంగా క‌లిగే అధ‌న‌పు ప్ర‌యోజనాలు వంటి విష‌యాల్లో త‌మ‌కు కావాల్సిన ధైర్యం - అవ‌కాశం ద‌క్కుతున్న క్ర‌మంలో పౌర‌స‌త్వం కోసం ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు.` అని తెలిపారు. నేష‌న‌ల్ పార్ట్‌ న‌ర్‌ షిప్ ఫ‌ర్ న్యూ అమెరిక‌న్స్ విడుద‌ల చేసిన నివేదిక ప్రకారం గ‌త రెండేళ్ల‌ కాలంలో 77% వృద్ధి క‌నిపించింది. జూన్ 2017 నాటికి 7.08 ల‌క్ష‌ల ద‌ర‌కాస్తులు అమెరికా పౌర‌స‌త్వం ఆమోదం కోసం పెండింగ్‌ లో ఉన్నాయి.