Begin typing your search above and press return to search.

హెచ్1బీ ఉద్యోగుల‌కు త‌క్కువ‌ జీతాలు..ప‌రిహారం చెల్లించిన అమెరికా కంపెనీ

By:  Tupaki Desk   |   5 Jun 2019 9:54 AM GMT
హెచ్1బీ ఉద్యోగుల‌కు త‌క్కువ‌ జీతాలు..ప‌రిహారం చెల్లించిన అమెరికా కంపెనీ
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో హెచ్1బీ ఉద్యోగుల‌కు ఎదుర‌య్యే చిత్ర‌మైన అనుభ‌వాల్లో ఇదొక‌టి. ఉన్న‌త అవ‌కాశాల‌కు వేదిక‌గా అమెరికా వెళ్ల‌గా ఓ కంపెనీ త‌క్కువ జీతానికి వారిని ఊడిగం చేయించుకుంది. అది తెలుసుకున్న అనంత‌రం వారు న్యాయం కోసం పోరాటం చేయ‌డంతో...తిరిగి వారికి త‌గు మొత్తాల్లో గ‌త జీతాలకు సంబంధించిన ప‌రిహారం చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అంతేకాకుండా వారి జీవితాల విష‌యంలో స‌మీక్షించి త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది. ఇలా 60 మంది టెకీల‌కు ఆల‌స్యంగా త‌మ శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ద‌క్కింది.

అమెరికాలో నైపుణ్య‌త గ‌ల ఉద్యోగాలు చేసేందుకు హెచ్‌1బీ వీసా మార్గం వేస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. అలా భార‌త్‌కు చెందిన కొంద‌రు టెకీలు అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలో గ‌ల ట్రోయ్‌లో ఉన్న పాపుల‌స్ గ్రూప్ అనే సంస్థలో ఉద్యోగులుగా చేరారు. అయితే, వారికి ఇచ్చే వేత‌నం విష‌యంలో భారీ వ్య‌త్యాసం క‌నిపించింది. దీంతో వారు డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబ‌ర్ వేజెస్ ఆండ్ హ‌వ‌ర్ డివిజ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులు స‌మ‌ర్పించిన ఆధారాలు వారి వాద‌న విన్న అనంత‌రం మొత్తం 594 మంది ఉద్యోగుల‌కు ప‌రిహారం రూపంలో త‌క్కువ‌గా చెల్లించిన వేత‌నాలు అందించాల‌ని ఆదేశాలు ఇచ్చారు. ఈ మొత్తం మందిలో భార‌తీయులు 60 మంది ఉన్నారు.

కాగా, మిచిగాన్ రాష్ట్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబ‌ర్ వేజెస్ ఆండ్ హ‌వ‌ర్ డిస్ట్రిక్ట్ డైరెక్ట‌ర్ టిమోలిన్ మిచెల్ ఈ ఫిర్యాదుపై స్పందిస్తూ `` అమెరికా కంపెనీలు త‌మ అవ‌స‌రాల‌కు త‌గిన నైపుణ్య‌వంతులు ల‌భ్యం కాని ప‌క్షంలో విదేశీయుల‌ను ఎంచుకునేందుకు ఉద్దేశించింది హెచ్‌1బీ వీసా. ఈ నేప‌థ్యంలో త‌క్కువ వేత‌నాలు ఇవ్వ‌డం స‌రైంది కాద‌ని ఈ తీర్పు ఇచ్చాం. అమెరికాలో ఉండే ఉద్యోగాల‌కు సంబంధించి సుర‌క్షితమైన మ‌రియు శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని అందించే వాతావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డం ముఖ్యం. తాజా తీర్పుతో అది స్ప‌ష్ట‌మైంది. ఉద్యోగుల విష‌యంలో వివ‌క్ష‌త‌కు తావు ఇచ్చేలా చెల్లింపులు ఉండ‌కూడ‌దు అనేది త‌మ విధాన‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.