Begin typing your search above and press return to search.

హెచ్1బీ : ట్రంప్ ఇచ్చిన తాజా షాక్ ఇదే

By:  Tupaki Desk   |   16 Nov 2017 5:56 PM GMT
హెచ్1బీ : ట్రంప్ ఇచ్చిన తాజా షాక్ ఇదే
X
అమెరికా సరుకులనే కొనండి.. అమెరికన్‌లనే పనిలో పెట్టుకోండి అంటూ ప్ర‌చారం చేసి అధికారంలోకి వ‌చ్చిన‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్1బీ వీసాలకు కళ్లెం వేశారు. విదేశాల నుంచి ఉన్నతస్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోనికి అనుమతించాలని, అధిక జీతం పొందేవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వాలని ట్రంప్ గ‌తంలోనే ఆదేశాల‌పై జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆదేశాల‌పై ఏర్పాటైన ఉన్న‌త సంఘం సంచ‌ల‌నం నిర్ణ‌యం తీసుకుంది. హెచ్-1బీ వీసా జారీ నిబంధనలు కఠినం చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్‌కు చెందిన అతున్నత స్థాయి సంఘం ఆమోదముద్ర వేసింది.

తాజా మార్పులు చట్టంలోకి రావాలంటే తొలుత ప్రతినిధులు సభ సభ్యులు, తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే దాన్ని చట్టంలోకి తీసుకొస్తారు. ఈ చట్ట ప్రకారం హెచ్-1బీ వీసాలపై వస్తున్న నిపుణులకు ఇస్తున్న వేతనాన్ని కంపెనీలు 60వేల డాలర్ల నుంచి 90వేల‌ డాలర్లకు పెంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెచ్1బీ వీసాలపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు కూడా అనేక రకాల షరతులు వర్తించనున్నాయి. అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాదారులను నియమించే విధానాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. కాగా, తాజా ప‌రిణామంతో ఐటీ విప్లవానికి జీవం పోసి అపార సంపదను సృష్టించిన హెచ్1బీ వీసాను అమెరికా ప్రభుత్వం అందనంత ఎత్తులో నిలబెట్టిన‌ట్ల‌యింద‌ని నిపుణులు అంటున్నారు. ఇలా భారతీయ ఐటియన్లకు అధ్యక్షుడు ట్రంప్ మరో కొర్రీపెట్టారని చెప్తున్నారు. వలసవాదుల దేశంలో భూమిపుత్రుల పేరిట విపరీత ధోరణులకు శ్రీకారం చుట్టారని మండిప‌డుతున్నారు.

కాగా, గ‌త నెల‌లో హెచ్ 1బీ వీసా విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భార‌త‌దేశ గ‌లాన్ని అమెరికాలో బ‌లంగా నొక్కి చెప్పారు. అమెరికాలో జరిగిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సుకు హాజ‌రైన జైట్లీ ఈ వేదికపైనే అమెరికాకు స్ప‌ష్ట‌మైన‌ డిమాండ్ చేశారు. హెచ్‌1బీ వీసాపై అమెరికాకు వస్తున్న భారత ఐటీ నిపుణులు అక్రమ ఆర్థిక వలసదారులేం కాదని ఆయ‌న తేల్చిచెప్పారు. వీసా విధానంపై నిర్ణయం తీసుకునేటప్పుడు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సర్కారు సముచితంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక‌మంత్రి భార‌త‌దేశం త‌ర‌ఫున గ‌ళం విప్పారు. ఈ నేప‌థ్యంలో తాజాగా అమెరికా కాంగ్రెస్ నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.