Begin typing your search above and press return to search.

కేవీపీ కేసు మళ్లీ కదిలింది

By:  Tupaki Desk   |   17 Nov 2015 10:17 AM GMT
కేవీపీ కేసు మళ్లీ కదిలింది
X
రాజ్యసభ సభ్యుడు - దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావుపై ఎఫ్ బీఐ అధికారులు పెట్టిన టైటానియం కేసు ఇంకా సమసిపోలేదు. అంతర్జాతీయ స్థాయి వ్యవహారమైన ఈ చిక్కుముడి నుంచి కేవీపీ తప్పించుకున్నట్లే అనిపించినా తాజాగా మళ్లీ ఆ కేసు కదలడంతో ఆయన వణుకుతున్నట్లు సమాచారం. ఈ కేసులో కేవీపీ భవిష్యత్తంతా ఉక్రెయిన్ చమురు మాఫియా నేత ఫిర్తాస్ దిమిత్రిపైనే ఆధారపడి ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి ఇప్పుడు ఆస్ట్రియాలో ఉంటున్నాడు. దిమిత్రిని గత ఏడాది మార్చి 12న ఆస్ర్టియాలో అరెస్టు చేశారు... ఆ తరువాత ఆయనకు బెయిలు ఇచ్చినా కూడా ఆస్ట్రియాను విడిచివెళ్లొద్దని ఆంక్షలు పెట్టారు. దీంతో ఆయన అక్కడే ఉండిపోయాడు. అయితే.. ఆ తరువాత రష్యా - అమెరికాల మధ్య కోల్డ్ వార్ వల్లే దిమిత్రిపై అమెరికా కేసు పెట్టిందని.. అంతేకానీ, కేసుకు సంబంధించి ఎలాంటి పత్రాలు సమర్పించలేదని పేర్కొంటూ దిమిత్రిని అమెరికాకు అప్పగించనవసరం లేదని తేల్చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావుకు కూడా దీనివల్ల ఊరట కలిగింది. దిమిత్రిని అప్పగించడానికి ఆస్ట్రియాలోని వియన్నా కోర్టు అంగీకరించకపోవడంతో అమెరికా కేవీపీపైనా దృష్టిపెట్టకుండా వదిలేసింది. ఆ తరువాత అక్టోబరులో ఆస్ట్రియా కోర్టు దిమిత్రిని ఆ దేశం వదిలి వెళ్లొచ్చని అనుమతి ఇచ్చింది.

కానీ, అదే రోజు వియన్నా పోలీసులు దానిపై అప్పీలు చేశారు. ఆ తరువాత అమెరికా కూడా తగిన పత్రాలతో అప్పీలు చేసింది. ఈ అప్పీలు విచారణకు కోర్టు ఓకే అంది. దీంతో త్వరలో ఈ కేసు మళ్లీ కదలబోతోంది. కేసు అప్పీలుకు వెళ్లడం.. కోర్టు స్వీకరించడం.. అమెరికా పత్రాలు దాఖలు చేయడంతో కేవీపీ గడగడలాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సమర్పించిన పత్రాల్లో ఏముందో తెలియకపోయినా ఏపీలోని టైటానియం వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారాయనడానికి ఆధారాలు అందులో ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ గుట్టు బయటపడితే కేవీపీని అమెరికా వెంటాడడం మొదలవుతుందని... ఆయన్ను అప్పగించాలని ఇండియాను కోరినా కోరొచ్చని తెలుస్తోంది.