Begin typing your search above and press return to search.

ట్రంప్‌ పై కోపం...ట్యాక్సులు క‌ట్టేందుకు నో

By:  Tupaki Desk   |   28 Feb 2017 4:32 PM GMT
ట్రంప్‌ పై కోపం...ట్యాక్సులు క‌ట్టేందుకు నో
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలపై ఆ దేశానికి చెందిన ప‌లువురు కొత్త నిర‌స‌న రూపాన్ని ఎంచుకున్నారు. త‌మ దేశ అధ్య‌క్షుడి తీరు ప‌ట్ల నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది అమెరికన్లు తమ ఫెడరల్‌ పన్ను చెల్లింపులను నిలిపివేస్తున్నారు. అధ్యక్షుడి ఆదేశాలను వ్యతిరేకించటానికి వారు చెబుతున్న కారణాలలో ప్రతిపాదిత మెక్సికన్‌ సరిహద్దు గోడ నిర్మాణంతో పాటు తాము చెల్లిస్తున్న పన్నుల సొమ్మును పర్యావరణ విధ్వంసానికి, దేశ అణ్వస్త్ర పాటవ విస్తరణకు వినియోగిస్తారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికన్‌ ప్రముఖులైన మియా ఫారో, గ్లోరియా స్టీన్‌మీన్‌ ఈ పన్నుల చెల్లింపు నిరాకరణకు తమ మద్దతును ప్రకటించారు. 1968నాటి వియత్నాం యుద్ధాన్ని నిరసిస్తూ తాము అప్పట్లో పన్ను చెల్లింపు నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించామని స్టీన్‌మీన్‌ గుర్తు చేశారు. మరోసారి ప్రణాళికా బద్ధ మాతృత్వ ప్రతిపాదనకు నిరసనగా మరోసారి కూడా తాము పన్ను చెల్లింపులను నిరాకరించామని ఆమె ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను చెల్లించిన పన్ను వివరాలను ట్రంప్‌ బహిర్గతం చేసే వరకూ తాము పన్నులు చెల్లించబోమని మరికొందరు అమెరికన్లు స్పష్టం చేశారు. అమెరికాలో జాతీయ పన్నుల దినోత్సవంగా నిర్వహించే ఏప్రిల్‌ 15న ట్రంప్‌ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె వివరించారు.

మ‌రోవైపు కొత్త వలస విధానాన్ని తమ దేశం అనుమతించే ప్రసక్తే లేదని మెక్సికో ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళతామని మెక్సికో విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి లూయిస్‌ విదెగారె తెలిపారు. ఒక దేశం మరో దేశంపై ఏకపక్షంగా నిబంధనలు రుద్దడాన్ని మెక్సికో ప్రభుత్వం, ప్రజలు సహించబోరని పేర్కొన్నారు. మెక్సికో ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి చర్యలను ఆమోదించలేమన్నారు. వలసవాసుల హక్కులను రక్షించేందుకు అవససరమనుకుంటే ఐక్యరాజ్య సమితిని ఆశ్రయిస్తామన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్‌, హోం ల్యాండ్‌ భద్రతా విభాగ డైరెక్టర్‌ జాన్‌ కెల్లీలు అత్యున్నత స్థాయిలో చర్చలు జరిపేందుకు మెక్సికో సిటీకి వచ్చారు. మెక్సికో అధ్యక్షుడు ఎన్‌రిక్‌ పెనా నీటో, ఇతర మంత్రులు, అధికారులతో టిల్లర్‌సన్‌, కెల్లీలు చర్చలు జరపనున్నారు. వీరి సమావేశాల్లో కొత్త వలస విధానాలే ప్రధాన ఎజెండాగా వున్నాయి. నేరం చేసినా, నేరం చేసినట్లు అనుమానం వున్నా అక్రమ వలసవాసులను వారి ఇంటికి పంపేలా ట్రంప్‌ సర్కార్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/