Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్‌ పై ర‌చ్చ:అమెరికా వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయే చాన్స్‌

By:  Tupaki Desk   |   20 Jan 2018 6:27 AM GMT
బ‌డ్జెట్‌ పై ర‌చ్చ:అమెరికా వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయే చాన్స్‌
X
అమెరికా వ్య‌వ‌స్థ అత‌లాకుత‌లం అయ్యే ప‌రిస్థితి ఎదురైంది. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి గడువు దాటేలోగా ట్రంప్‌ ప్రభుత్వం వ్యయ బిల్లును ఆమోదించలేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదముంది. రిపబ్లికన్ల నియంత్రణలోని కాంగ్రెస్‌ ఈలోగా తాత్కాలిక అవసరాల కోసం రూపొందించిన నిధులను సమకూర్చుకునే బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోద ముద్ర వేయించే పనిలో నిమగమైంది. రక్షణ వ్యయం బాగా పెంచాలని కన్జర్వేటివ్‌ లు కోరుతున్నారు. తాత్కాలిక బిల్లులో అటువంటివి చేర్చే అవకాశం ఉండదు.

కాగా ఇమ్మిగ్రేషన్‌ (వలసల) విధానం పరిష్కారమైతే తప్ప ప్రభుత్వానికి మద్దతు ఇవ్వరాదని పలువురు డెమోక్రట్లు భావిస్తున్నారు. పిల్లలుగా ఉన్నపుడు దేశంలోకి వచ్చిన వారిని తిరిగి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకునే దిశగా గత వారం జరిగిన చర్చల్లో అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఆ తర్వాత చర్చలు జరిపేందుకు వాతావరణం అనువుగా లేకుండా పోయింది. కొంతమంది సెనెటర్లు కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ట్రంప్‌ తిరస్కరించడంతో రిపబ్లికన్లు - డెమోక్రట్ల మధ్య తలెత్తిన విభేదాలు ఆప్రికా దేశాల నుండి వచ్చే వలసలను ఉద్దేశిస్తూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించకుండా నివారించడానికి తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటనే అంశంపై ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు సమావేశం కానున్నట్టు కాంగ్రెస్‌ సభ్యులు తెలిపారు.

ఇదిలాఉండ‌గా....నిర్వహణకు అవసరమైన నిధులు లేక ప్రభుత్వం కుప్పకూలితే విధ్వంసకర పర్యవసానాలు ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. రాజకీయంగా అత్యంత ఇబ్బందికర పరిస్థితిని నివారించేందుకు ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. శుక్రవారం అర్ధరాత్రి కల్లా ఈ పరిస్థితి రానున్న నేపథ్యంలో గురువారం తెల్లవారు జామునుండే ట్రంప్‌ ఈ విషయంపై ట్వీట్లు మోత మోగిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగడానికి సరైన నిధులు లేక స్తంభించిపోయిన పక్షంలో అత్యవసర సర్వీసుయేతర ఉద్యోగులను ఇళ్ళ వద్దనే ఉండాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. బడ్జెట్‌ ఒప్పందం కుదిరేవరకు వారు ఇళ్లవద్దనే ఉండాల్సి వుంటుంది.కీలక ప్రభుత్వ సంస్థలైన వైట్‌ హౌస్‌ - కాంగ్రెస్‌ - విదేశాంగ శాఖ - పెంటగన్‌ కార్యకలాపాలు సాగుతునే ఉంటాయి. అయితే పరిమితమైన సిబ్బందితో పనిచేస్తాయి. సైన్యం కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే సైనికులకు వారి వేతనాలు చెల్లించరు.

1995 - 1996 - 2013ల్లో ఇటువంటి పరిస్థితి ఎదురైనపుడు రోజుకు దాదాపు 8లక్షలమంది ఉద్యోగులు ఇళ్ళకే పరిమితమయ్యారు. గతంలో మూడుసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైన తర్వాత కూడా బడ్జెట్‌ పై రాజీ పడడంలో విఫలమైనందుకు కారణమంటూ పాలక - ప్రతిపక్షాలు పరస్పరం నిందించుకుంటున్నాయి. బడ్జెట్‌ బిల్లును వ్యతిరేకిస్తూ డెమోక్రాట్లు ఓటు వేయకుండా ఉండేందుకు గానూ వారిని ఒప్పించేలా రిపబ్లికన్లు తాత్కాలిక ప్రాతిపదికన నిధులు సమకూర్చడానికి తీసుకుంటున్న చర్యను ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. బాలల ఆరోగ్య బీమా కార్యక్రమం (చిప్‌)ను ఆరేళ్ళపాటు పొడిగిస్తామనే హామీని డెమోక్రాట్లకు ఇవ్వాలని భావిస్తున్నారు.