Begin typing your search above and press return to search.

వైట్ హౌస్ ప్రకటన: మనది పటిష్ట బంధం

By:  Tupaki Desk   |   26 Feb 2020 10:15 AM GMT
వైట్ హౌస్ ప్రకటన: మనది పటిష్ట బంధం
X
భారతదేశంలో తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా దంపతుల పర్యటనపై అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ స్పందించింది. ఫిబ్రవరి 24-25 తేదీల్లో ట్రంప్ భారత పర్యటన విజయవంతమైందని ప్రకటించింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఈ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వైట్ హౌస్ ప్రకటించింది. ఇక కొత్త శకం ఆరంభమైనట్టే అని అభివర్ణించింది. రెండు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం అర్ధరాత్రి ట్రంప్ దంపతులు అమెరికాకు తిరిగి వెళ్లారు.

ఈ సందర్భంగా బుధవారం అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం భారత పర్యటనపై స్పందిస్తూ ఇరు దేశాల బంధం పటిష్టమైనదిగా పేర్కొంది. రక్షణ, సెక్యూరిటీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని తమ అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధానమంత్రి మోదీ ఇద్దరూ నిర్ణయించుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. అమెరికా నుంచి ఎంహెచ్-60 ఆర్ నేవల్, ఏ హెచ్ -64 ఈ అపాచీ హెలీకాఫ్టర్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకోవడం ట్రంప్ పర్యటనలో కీలకమైన నిర్ణయమని పేర్కొంది.

భారత ఉపఖండంలో సుస్థిరత, శాంతి నెలకొనేలా చూడాలన్న ఏకాభిప్రాయానికి ఇద్దరు అగ్రనేతలూ వచ్చారని ట్రంప్ పర్యటనలో జరిగిన విషయాన్ని ప్రస్తావించింది. భారతదేశంలో సాధ్యమైనంత త్వరలో ఆరు న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి టెక్నో-కమర్షియల్ ఆఫర్ ను ఖరారు చేసుకునేందుకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అమెరికాలోని వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ రెండూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉభయ నేతలూ ఒప్పందానికి రావడంపై హర్షించింది. భారత్ లోని ఇస్రో, అమెరికాలోని నాసా అంతరిక్ష విజ్ఞాన సంబంధ సహకారాన్ని మరింత పెంచుకోవాలని, 2022లో సంయుక్త మిషన్ కి శ్రీకారం చుట్టాలని ట్రంప్, మోదీ భేటీల నిర్ణయించిన అంశంపై కూడా స్పందించింది. మొత్తానికి భారత పర్యటనను అమెరికా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.