Begin typing your search above and press return to search.

మోదీ సర్కార్ పై యూఎస్ ఇంటెలిజెన్స్ కీలక నివేదిక !

By:  Tupaki Desk   |   15 April 2021 10:37 AM GMT
మోదీ సర్కార్ పై యూఎస్ ఇంటెలిజెన్స్ కీలక నివేదిక !
X
పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మోదీ ప్రభుత్వం సైనిక శక్తి ద్వారా బదులిచ్చే అవకాశం గతంలో కంటే ప్రస్తుతం మరింత పెరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా జాతియ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం కాంగ్రెస్‌ కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. రెండు దేశాలు యుద్ధానికి దిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మధ్య వివాదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ నివేదికలో అభిప్రాయ పడ్డారు. పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే..లేదా అలా చేసినట్టు భారత్ భావిస్తే..మోదీ ప్రభుత్వం సైనిక శక్తి ద్వారా బదులివ్వచ్చు.

ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ అవకాశం మరింత పెరిగింది. ఇరు దేశాల మధ్య నెలకొనే ఉద్రిక్తతలు ఘర్షణకు దారితీసే అవకాశాలను పెంచుతాయి. కశ్మీర్ ‌లో హింస ప్రజ్వరిల్లడం, ఇతర ప్రాంతాల్లో మిలిటెంట్ దాడులు ఈ వివాదాలకు కేంద్రంగా మారొచ్చు అని ఈ నివేదికలో వెల్లడైంది. కశ్మీర్‌ కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని భారత్ ప్రభుత్వం తొలగించడంతో భారత్,పాక్‌ ల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇరు దేశాలూ తమ హైకమిషనర్లను స్వదేశానికి పిలిపించుకున్నాయి. పాక్‌‌ తో దౌత్యసంబంధాలు సాధారణ స్థితికి రావాలని తాము కోరుకుంటున్నట్టు భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. ఉగ్రవాదం, హింసకు చోటులేని వాతావరణంలోనే ఇది సంభవమని, ఇటువంటి వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత పాకిస్థాన్ ‌దేనని భారత్ స్పష్టం చేసింది. అమెరికా జాతియ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదిక ప్రకారం అప్ఘానిస్థాన్, ఇరాక్, సిరియా‌లో అశాంతి, హింస అమెరికా సైన్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి.