Begin typing your search above and press return to search.

గాంధీజీకి అమెరికా కాంగ్రెస్ మెడల్ ఇస్తారట

By:  Tupaki Desk   |   20 Aug 2018 1:40 PM GMT
గాంధీజీకి అమెరికా కాంగ్రెస్ మెడల్ ఇస్తారట
X
జాతిపిత మహాత్మాగాంధీకి సంబంధించి ఊహించ‌ని ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. తన జీవితకాలంలో పదవులు ఎన్నడూ కోరుకోలేదు. పురస్కారాలు - సన్మానాల కోసం ఎన్నడూ తపించలేదు. ఒకరకంగా చెప్పాలంటే వీటన్నిటికీ ఆయన అతీతుడు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజాన్ని శాంతి - ఆహింసలతో లొంగదీసుకున్న గాందీజీకి నోబెల్ పురస్కారం ఎందుకు ఇవ్వలేదన్నది ఓ అంతు చిక్కని ప్రశ్న. ఇప్పుడు ఆయన మరణించిన సుమారు 70 ఏళ్ల‌కు అమెరికా సర్కారు వారు తమ అత్యున్నత పౌరపురస్కారమైన కాంగ్రెషనల్ గోల్డ్‌ మెడల్ ఇస్తారట. ఈ విష‌యాన్ని ఆ దేశానికి చెందిన చ‌ట్ట‌స‌భ స‌భ్యురాలు ప్ర‌వేశ‌పెట్టానున్నారు.

ప్రముఖ నటుడు కమల్ హాసన్ - ఆయన కూతురు శ్రుతి హాసన్ - బాలివుడ్ క్యారెక్టర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ - వెస్టిండీస్ మాజీ క్రెకటర్ వివియన్ రిచర్డ్స్ - భారత దౌత్యాధికారులు - ఎన్నారైలు మాన్‌ హాటన్ మేడిసన్ ఎనెన్యూలో జరిగిన ఇండియా డే పరేడ్‌ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు కారొలిన్ మనోలీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పౌరహక్కుల కోసం శాంతియుత ఉద్యమాలు నిర్వహించేలా స్ఫూర్తిని కలిగించినందుకు గాంధీజీ పేరును మెడల్‌ కు ప్రతిపాదిస్తానని ఆమె పేర్కొన్నారు. అందుకు అవసరమైన బిల్లును ప్రవేశపెడతానని వెల్లడించారు. తాను ప్రవేశపెట్టే బిల్లుకు తగిన మద్దతు లభిస్తుందని మలోనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ప్రజాసేవకురాలిగా గాంధీజీ సాహసం - ఆదర్శాలు తనకూ స్పూర్తినిచ్చాయని చెప్పారు. నువ్వు కోరుకునే మార్పును నీలోనే చూపాలన్న గాందీజీ వాక్కులను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇదిలాఉండ‌గా....గాంధీజీ ఆలోచనలతో ప్రభావితులై ఉద్యమాలు నడిపిన మార్టిన్ లూథర్‌ కింగ్ - మండేలా వంటి వారికి గతంలోనే ఈ మెడల్ బహూకరించారు. ఇన్నాళ్ల‌కు ఆయ‌న పేరును ప్ర‌తిపాదిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ మెడల్‌కు జన్మతహా భారతీయులైనవారు ఎవరినీ ఎంపిక చేయలేదు. భారత పౌరుల్లో మదర్ థెరెసాకు మాత్రమే దీనిని బహూకరించారు. తాజాగా గాంధీజి పేరు తెర‌మీద‌కు తేవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.