Begin typing your search above and press return to search.

బైడెన్ సిత్రం.. అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆదాయం అంతలా తగ్గిందట

By:  Tupaki Desk   |   17 April 2022 4:33 AM GMT
బైడెన్ సిత్రం.. అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆదాయం అంతలా తగ్గిందట
X
అత్యున్నత పదవి.. అది కూడా ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడు కావటానికి మించింది ఏముంటుంది? ప్రపంచాన్ని శాసించే కుర్చీలో కూర్చునే వ్యక్తి ఆదాయం సాధారణంగా పెరుగుతుందని భావిస్తాం. అయితే.. తాజాగా బయటకొచ్చిన లెక్కల్ని చూస్తే.. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బైడెన్ వ్యక్తిగత ఆదాయం మాత్రమే కాదు.. ఈ దంపతుల ఆదాయం కూడా భారీగా పడిపోయిందన్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడయ్యాక వారి ఆదాయం ఏ స్థాయిలో తగ్గిందన్న విషయం తాజాగా వారు చెల్లించిన పన్ను లెక్కను చూసినప్పుడు ఇట్టే అర్థమైపోతుంది.

అమెరికా అధ్యక్షుడు కావటానికి ముందు అంటే 2019లో బైడెన్ దంపతుల వార్షిక ఆదాయం 10 లక్షల డాలర్లుగా ఉండేది. అప్పట్లో వారు పుస్తకాల అమ్మకాలు.. ప్రసంగాలు.. టీచింగ్ ద్వారా ఈ భారీ మొత్తాన్ని ఆర్జించేవారు. అయితే.. తాజాగా వారి ఆదాయం మాత్రం భారీగా తగ్గింది. 2021 వార్షిక ఆదాయాన్నిచూస్తే.. 6,10,702 డాలర్లుగా లెక్క తేలింది.

ఈ మొత్తంలో 24.6 శాతం పన్ను ఆదాయం అంటే 1,50,439 డాలర్లను ప్రభుత్వానికి చెల్లించారు. అంటే.. దేశాధ్యక్ష పదవి కంటే ముందు వారి ఆదాయం దాదాపు నాలుగు లక్షల డాలర్ల వరకు ఎక్కువగా ఉందన్న విషయం తాజా లెక్కల్ని చూస్తే అర్థమవుతుంది.

ఫస్ట్ లేడీగా వ్యవహరిస్తున్న జిల్ ఇప్పటికి నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఒకవేళ.. ఆమె ఆ ఉద్యోగాన్ని చేయకుంటే.. ఈ దంపతుల వార్షిక ఆదాయం మరింత తక్కువగా ఉండేదని చెప్పక తప్పదు. ఏమైనా.. తమ ఆదాయం.. పన్ను చెల్లింపు అంశాల్ని పబ్లిక్ కు విడుదల చేస్తున్న బైడెన్ దంపతులు చక్కటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాలి.

బైడెన్ కు ముందు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం.. తన.. తన కుటుంబానికి చెందిన వార్షిక ఆదాయాన్ని ప్రజలకు తెలియజేయటానికి ససేమిరా అనేవారు. అందుకు భిన్నంగా బైడెన్ మాత్రం ట్రంప్ ముందున్న దేశాధ్యక్షుల్ని ఫాలో అవుతూ.. తమ ఆదాయ వివరాల్ని వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దంపతులు తమ వార్షిక ఆదాయం 16.55లక్షల డాలర్లుగా పేర్కొన్నారు. ఇందుకు 5.23 లక్షల డాలర్లను పన్నుగా చెల్లించారు. దేశాధ్యక్షుడి కంటే కూడా దేశ ఉపాధ్యక్షుడి ఆదాయం తక్కువగా ఉండటం గమనార్హం.?