Begin typing your search above and press return to search.

హెచ్ 1బీ వీసా అప్లై చేసే తీరు మారిందట

By:  Tupaki Desk   |   8 Dec 2019 4:15 AM GMT
హెచ్ 1బీ వీసా అప్లై చేసే తీరు మారిందట
X
డాలర్ కలల్ని తీర్చుకునేందుకు అవకాశం ఇచ్చే హెచ్ 1 బీ వీసా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి వీలు కల్పించే ఈ వీసా వచ్చిందంటే చాలు లైఫ్ మారిపోతుందన్న మాట తరచూ పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ఈ వీసాను అప్లై చేసుకునే విధానంలో కొత్త తీరును తీసుకొచ్చారు. దరఖాస్తు విధానాన్నిమార్చినట్లుగా అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది. తాజాగా విడుదలైన ప్రకటన ప్రకారం 2021లో హెచ్ 1బీ వీసాల కోసం అప్లై చేసే వారు మాన్యువల్ గా కాకుండా ఎలక్ట్రానిక్ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ కోసం పది డాలర్లను ఫీజుగా ఫిక్స్ చేశారు. ప్రతి ఏడాది 85వేల హెచ్ 1బీ వీసాల దరఖాస్తుల్ని లాటరీ పద్దతిలో ఎంపిక చేయటం తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానం కారణంగా పేపర్ వర్క్ తగ్గిపోవటమే కాదు.. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సమాచారం ఇవ్వటం చాలా తేలిక అవుతుందని చెబుతున్నారు. 2020-21 సంవత్సరానికి సంబంధించిన హెచ్ 1 బీ వీసాల కోసం వచ్చే ఏడాది మార్చి ఒకటి నుంచి ఇరవయ్యో తేదీ వరకూ అప్లికేషన్లు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందంటున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి అప్లికేషన్లను తీసుకుంటారని చెబుతున్నారు.