Begin typing your search above and press return to search.

మోడీ ‘రద్దు’పై పెద్దన్న కామెంట్ ఇదే..

By:  Tupaki Desk   |   1 Dec 2016 4:23 PM GMT
మోడీ ‘రద్దు’పై పెద్దన్న కామెంట్ ఇదే..
X
ప్రధాని మోడీ తీసుకున్న రద్దు నిర్ణయంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రద్దుపై సంచలన నిర్ణయం తీసుకున్న వెంటనే భారతీయుల స్పందనకు.. ఆ నిర్ణయం వెలువడిన 23 రోజుల తర్వాత ఉన్న పరిస్థితికికాస్త మార్పు వచ్చిందని చెప్పాలి. రద్దు నిర్ణయంపై ప్రజలు పాజిటివ్ గా ఉన్నప్పటికీ.. అసలు సమస్యంతా కరెన్సీ కొరతపైనే.

బ్యాంకుల్లోనూ.. ఏటీఎంలలోనూ కరెన్సీ కొరతతో.. నోట్ల కోసం గంటల కొద్దీ క్యూలో నిలుచోవాల్సి రావటంపై సామాన్యుడు సీరియస్ గా ఉన్నాడు. అది మినహా.. మోడీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్న వారే ఎక్కువ. ఇదిలా ఉంటే.. మోడీ తీసుకున్న రద్దు నిర్ణయంపై అగ్రరాజ్యమైన అమెరికా స్పందించింది. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా.. ఈ నిర్ణయాన్ని స్వాగతించటమే కాదు.. తమ మద్దతు కూడా ఉంటుందని పేర్కొంది.

అవినీతిని అంతమొందించటానికి పెద్దనోట్ల రద్దు చాలా కీలకమైన.. ముఖ్యమైన.. అవసరమైన చర్యగా అగ్రరాజ్యం అభివర్ణించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని పుల్ స్టాప్ పెట్టటానికి ఈ చర్య ఎంతో ఉపయోగపడుతుందని తాము నమ్ముతున్నట్లుగా స్టేట్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ వెల్లడించారు. భారత్ లో నివసించే తమ దేశ పౌరులందరికి.. పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని అందించినట్లుగా చెప్పారు. వారికి సమాచారం సక్రమంగా వెళ్లి ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పెద్దనోట్ల రద్దు కారణంగా భారతీయులకు కొంత అసౌకర్యం ఏర్పడినప్పటికీ.. అవినీతిని నిర్మూలించటానికి పెద్దనోట్ల రద్దు ఎంతో ముఖ్యమైన చర్యగా పేర్కొనటం గమనార్హం. ఈ చర్యతో పన్ను ఎగవేతదారులపై కూడా చర్య తీసుకున్నట్లైందని చెప్పటం చూస్తే.. అగ్రరాజ్యం మాటలు మోడీకి.. ఆయన పరివారానికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/