Begin typing your search above and press return to search.

ట్రంప్‌ దెబ్బ‌కు ఆ రెండు దేశాలు విల‌విల‌!

By:  Tupaki Desk   |   9 Sep 2017 7:25 AM GMT
ట్రంప్‌ దెబ్బ‌కు ఆ రెండు దేశాలు విల‌విల‌!
X

`డోక్లాం` విష‌యంలో భార‌త్‌ తో క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్న చైనాకు ఇప్పుడు అమెరికా గ‌ట్టి షాక్ ఇచ్చింది. అమెరికా - ఉత్త‌ర‌కొరియా ఎప్పుడు ఏ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటాయోన‌ని ప్ర‌పంచ దేశాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒక దేశంపై మ‌రో దేశం క‌య్యానికి కాలు దువ్వేందుకు సిద్ధమ‌వుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ఉత్త‌ర‌కొరియాకు స‌హ‌క‌రించే దేశాల‌పై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. ఆ దేశానికి స‌హకరిస్తోంద‌న్న అనుమానం క‌లిగినా.. చ‌ర్య‌ల‌కు ఉప‌క్రమిస్తోంది. ఉత్త‌ర కొరియా ఆర్థిక మూలాల‌పై దెబ్బ‌కొట్టేందుకు అమెరికా స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. ఉత్త‌ర కొరియాకు ఆర్థికంగా సాయం అంద‌జేస్తున్న‌ అమెరికాలోని చైనా కంపెనీల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు అమెరికా ప్ర‌క‌టించింది.

అణ్వాస్త్ర ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న ఉత్త‌ర కొరియాకు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఇప్ప‌టికే 40 ఏళ్లుగా అమెరికాలోని న్యూయార్క్ లో సేవలందిస్తున్న పాకిస్థాన్ బ్యాంక్ పై అమెరికా ఫైనాన్షియల్ సంస్థ ఉక్కుపాదం మోపి దానిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చైనాను టార్గెట్ చేసుకున్నారు. చైనా కంపెనీలు మనీ లాండరింగ్‌ కు పాల్పడుతూ ఉత్తరకొరియాకు లాభం చేకూర్చుతున్నాయని అమెరికా ఆరోపించింది. అలాంటి కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.

నిషేధం విధించడమే కాకుండా ఆ కంపెనీలకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులను సీజ్ చేసింది. ప్రధానంగా చైనాకు చెందిన జడ్ టీఈ కార్పొరేషన్ సంస్థ ఉత్తరకొరియాకు అక్రమంగా మనీ చేరవేస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు సేకరించిన అధికారులు - కంపెనీని సీజ్ చేశారు. ఇలాంటి చర్యల్లో మరికొన్ని చైనా కంపెనీలు భాగమయ్యాయని, త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా కంపెనీలు అమెరికా గడ్డపై వ్యాపారాలు చేస్తూ ఉత్తరకొరియాకు లాభం చేకూర్చడం ఎంతమాత్రం హర్షణీయం కాదని, అందుకే చర్యలు తీసుకుంటున్నామని అమెరికా స్పష్టం చేసింది.