Begin typing your search above and press return to search.

ట్రంప్ ప్రతిపాదన..తెలుగు ఎన్ ఆర్ ఐలు ఆందోళన

By:  Tupaki Desk   |   26 April 2018 11:54 AM GMT
ట్రంప్ ప్రతిపాదన..తెలుగు ఎన్ ఆర్ ఐలు ఆందోళన
X
అమెరికా జారీ చేసే హెచ్-4 వీసాలకు వర్క్‌పర్మిట్‌ను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ఐటీ పరిశ్రమ - ఫేస్‌ బుక్ వంటి దిగ్గజ సంస్థలు - పలువురు శాసనకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. హెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నవారి జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసా అమెరికాలో పని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ సదుపాయాన్ని ఒబామా ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. ఈ వీసాదారుల్లో ఎక్కువ శాతం మంది భారతీయులే ఉన్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం హెచ్-4 వీసాదారులకు పని అనుమతిని రద్దు చేయాలని ప్రతిపాదించింది. దీనిపై పలు రంగాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. హెచ్4 వీసాదారుల వర్క్‌ పర్మిట్‌ ను ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు తెలుగు రాష్ర్టాలకు చెందిన వారి నుంచి కూడా నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

ట్రంప్ నిర్ణయాన్ని మ‌న ఎన్నారైల పేరెంట్స్ అసోసియేష‌న్ ఖండించింది. కొత్త విధానం వల్ల అమెరికాలో నివసిస్తున్న అనేక మంది తెలుగువారిపై ప్రభావం ఉంటుందని ఆ సంఘం ఆరోపించింది. వర్క్ పర్మిట్‌ ను ఎత్తివేస్తూ తీసుకోబోయే నిర్ణయాన్ని అమలు చేయరాదు అని ఎన్ ఆర్ ఐ సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇతర అధికారులకు ఆ సంస్థ తమ సమస్యను తెలుపాలనుకుంటున్నది. హెచ్4 వీసాదారులు పనిచేసుకునేందుకు గతంలో ఒబామా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ ప్రతిపాదనను ఎత్తివేయాలనుకోవడంతో పరిస్థితి తారుమారైంది.

కాగా, ఈ నిర్ణ‌యం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ అనే సంస్థ పేర్కొంది. ఫేస్‌ బుక్ - గూగుల్ - మైక్రోసాఫ్ట్ వంటి టాప్ ఐటీ కంపెనీలు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. హెచ్-4 వీసాలకు పని అనుమతిని రద్దు చేస్తే హెచ్-1బీ వీసాదారులు ఒక్కరే తమ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారుతుందని, ఇది ఆ కుటుంబ ఆర్థిక స్థోమతను దెబ్బతీస్తుందని పేర్కొంది. వారు చెల్లించే పన్నులు, వారి ఖర్చులు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని వివరించింది. హెచ్-4 వీసాదారుల పని అనుమతిని రద్దు చేస్తే అంతిమంగా ఆమెరికా ప్రజలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని కాలిఫోర్నియాకు చెందిన 15 మంది శాసనకర్తల బృందం అభిప్రాయపడింది. ప్రభుత్వానికి ఆదాయం తగ్గి అంతిమంగా అమెరికా ప్రజలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని పేర్కొంది.