Begin typing your search above and press return to search.

ఇబ్బంది లేదంటున్న అమెరికా యూనివ‌ర్సిటీలు

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:15 AM GMT
ఇబ్బంది లేదంటున్న అమెరికా యూనివ‌ర్సిటీలు
X
అమెరికా నూత‌న అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ‌ల‌స‌ల‌ను నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ పై సంత‌కం చేయ‌డం - వ‌ల‌స‌ల‌పై ఆంక్ష‌లు విధించనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న‌ నేప‌థ్యంలో విదేశీయుల్లో ముఖ్యంగా భార‌తీయుల్లో ఒకింత ఆందోళ‌న పెరిగిన సంగ‌తి తెలిసిందే. అందులోనూ విద్యార్థుల్లో క‌ల‌వ‌రం ఎక్క‌వ అయింది. హెచ్‌1బీ వీసాల‌పై క‌త్తెర వేయ‌డంతో పాటు విదేశీ విద్యార్థులు విద్య‌ను అభ్య‌సించిన అనంత‌రం ఉద్యోగం సంపాదించుకునే ఎఫ్‌1 వీసాల విష‌యంలోనూ పెద్ద ఎత్తున కోత ప‌డ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే స‌ద‌రు ఆందోళ‌న‌ను దూరం చేసేందుకు అమెరికాలోని యూనివ‌ర్సిటీలు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టనలు విడుద‌ల చేస్తున్నాయి.

అమెరికాలోని ఆయా యూనివ‌ర్సిటీలు భార‌త‌దేశంలో ఉన్న త‌మ అధికృత స‌మాచార కేంద్రాల ద్వారా విద్యార్థుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల్లో భ‌రోసా నింపుతున్నాయి. అమెరికాలో విద్యార్థులు త‌న ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని, ఈ విష‌యంలో అన‌వ‌స‌ర‌మైన క‌ల‌వ‌ర‌పాటుకు గురి కావ‌ద్ద‌ని అధికారిక స‌మాచారం ద్వారా యూనివ‌ర్సిటీలు సూచిస్తున్నాయి. ఇప్ప‌టికిప్పుడు వారి చ‌దువుకు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌ని, భ‌విష్య‌త్తులోనూ ఉండ‌బోద‌ని పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌తిపాద‌న‌లో ఉన్న బిల్లు చ‌ట్ట‌స‌భ‌(హౌస్ ఆఫ్ కామ‌న్స్‌) ఆమోదం పొందే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చున‌ని ఆయా యూనివ‌ర్సిటీలు వివ‌రిస్తున్నాయి. మ‌రోవైపు అమెరికాలోని ప‌లు యూనివ‌ర్సిటీలు ప్ర‌తిపాదిత చ‌ట్టంపై త‌మ నిర‌స‌న గ‌ళం విప్ప‌డం ప్రారంభించాయి. కొత్త అధ్య‌క్షుడు ట్రంప్ కు వ్య‌తిరేకంగా వారు త‌మ ఆందోళ‌న‌ను వెళిబుచ్చుతున్నారు.

విదేశీ విద్యార్థుల‌ను అడ్డుకునే విధంగా చ‌ట్టాలు తీసుకు వ‌స్తే త‌మ ఆదాయంలో పెద్ద ఎత్తున కోత ప‌డ‌నుంద‌ని ప‌లు యూనివ‌ర్సిటీల ప్ర‌తినిధులు ఇప్ప‌టికే త‌మ ఆందోళ‌న‌ను వెల్ల‌డించారు. విదేశాల‌కు చెందిన విద్యార్థులు అమెరికాలో విద్యాభ్యాసానికి రావ‌డం వ‌ల్ల‌నే ఆయా యూనివ‌ర్సిటీలు పెద్ద ఎత్తున ఆదాయం స‌మ‌కూర్చుకోగ‌లుగుతున్నాయి. అమెరిక‌న్లు మాత్ర‌మే విద్య అభ్య‌సించాల‌ని, ఇత‌ర దేశాల‌కు చెందిన వారికి ప్ర‌వేశం లేద‌ని చెప్ప‌డం వ‌ల్ల మెజార్టీ యూనివ‌ర్సిటీల ఆదాయంలో భారీగా కోత ప‌డ‌నుండ‌టంతో ఈ నిర‌స‌న మొద‌లైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/