Begin typing your search above and press return to search.

అమెరికా మాట‌!..భార‌త్‌ కెళ్తే మ‌రింత జాగ్ర‌త్త‌!

By:  Tupaki Desk   |   11 Jan 2018 11:16 AM GMT
అమెరికా మాట‌!..భార‌త్‌ కెళ్తే మ‌రింత జాగ్ర‌త్త‌!
X
అగ్ర‌రాజ్యం అమెరికా... ఇత‌ర దేశాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే త‌న దేశ‌స్తుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల‌హాలు - సూచ‌న‌లు - జాగ్ర‌త్త‌లు - హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ ఉంటుంది. ఈ దిశ‌గా ఒక్క అమెరికానే కాకుండా ప్ర‌పంచంలోని అన్ని దేశాలు కూడా త‌మ పౌరుల‌కు ఈ త‌ర‌హా సూచ‌న‌లు చేస్తున్నా.. ప్ర‌పంచ పోలీస్ బాస్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికా ఈ విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేసే ప్ర‌క‌ట‌న‌ల‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఉంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. ఆయా దేశాల్లో భ‌ద్ర‌త‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష చేసే అమెరికా విదేశాంగ శాఖ... ఆయా దేశాల‌కు వెళ్లే త‌మ పౌరుల భ‌ద్ర‌త‌పై మాత్రం కాస్తంత స్ప‌ష్ట‌మైన - జాగ‌రూక‌త‌తో కూడిన వైఖ‌రితోనే ముందుకు వెళుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌ల్లో.. ఏదేనీ దేశానికి త‌మ పౌరులు వెళ్ల‌రాద‌ని - అప్ప‌టికే ప్ర‌యాణాల‌కు ఏర్పాట్లు చేసుకుంటే ర‌ద్దు చేసుకోవాల‌ని అమెరికా హెచ్చ‌రించిందంటే... ఆ దేశంలో ప‌రిస్థితులు పూర్తిగా దిగ‌జారిపోయాయ‌నే అనుకోవాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో ట్రావెల్ అడ్వైజ‌రీ పేరిట‌ అమెరికా జారీ చేసే ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో త‌మ‌కు సంబంధించి చెడు భావ‌న ఉండేలా లేకుండా చూసుకునేందుకే ప్ర‌పంచంలోని అన్ని దేశాలు కూడా య‌త్నిస్తాయి. ఈ క్ర‌మంలో నిన్న అమెరికా త‌న దేశ పౌరుల‌కు జారీ చేసిన ట్రావెల్ అడ్వైజ‌రీలో భార‌త్ ప్ర‌స్తావ‌న వ‌చ్చేసింది. ఆ ప్ర‌స్తావ‌న కూడా భార‌త్‌కు కాస్తంత ఇబ్బంది క‌లిగించేదిగానే ఉండ‌టంతో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌ గా మారిపోయింది. అంతేకాకుండా భార‌త్‌ లో ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌న్న విష‌యాన్ని స‌వివ‌రంగా వివ‌రిస్తూ... భార‌త్‌లోని ఏఏ ప్రాంతాల్లో పర్య‌టించ‌రాద‌న్న విష‌యాన్ని కూడా అమెరికా కాస్తంత స్ప‌ష్టంగానే వివ‌రించింది. భార‌త్‌కు కాస్తంత ఇబ్బందిక‌రంగా మారిన ఈ ట్రావెల్ అడ్వైజ‌రీలో భార‌త్‌కు వెళ్ల‌రాద‌ని అమెరికా చెప్ప‌లేదు గానీ... భారత్ వెళితే మాత్రం మునుప‌టి కంటే కూడా కాస్తంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఆయా దేశాల్లో నెల‌కొన్న ప‌టిష్ట భ‌ద్ర‌త నుంచి దుర్భ‌ర ప‌రిస్థితులు నెల‌కొన్న దేశాల‌ను వ‌ర్గాలుగా విభ‌జించిన అమెరికా మొత్తంగా ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను నాలుగు కేట‌గిరీలుగా విభ‌జించింది. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టంగా ఉండే దేశాల‌ను లెవెల్ 1 కేట‌గిరీలో పేర్కొనే అమెరికా... క‌ల్లోల ప‌రిస్థితులు ఉన్న దేశాల‌ను లెవెల్ 4 కేట‌గిరీలో ఉంచుతుంది. అంటే లెవెల్ 1 కేట‌గిరీలోని దేశాల‌కు వెళ్లే అమెరిక‌న్లు... నిర్భ‌యంగా వెళ్లి రావ‌చ్చ‌న్న మాట‌. అదే లెవెల్ 4 కేట‌గిరీ కింద ఉండే దేశాల‌కు వెళ్లాల‌నుకునే అమెరికన్లు త‌మ ప‌ర్య‌ట‌న‌ల‌ను ర‌ద్దు చేసుకోవాల్సిందేన‌ని అమెరికా విదేశాంగ తేల్చి చెబుతుంది. మ‌రి ఈ నాలుగు కేటగిరీల్లో... ప్ర‌స్తుతం అమెరికా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజ‌రీలో భార‌త్ ఏ కేట‌గిరీలో ఉందంటే... లెవెల్ 2లో ఉంద‌ట‌. అంటే... భార‌త్ వెళ్లాల‌నుకునే అమెరికన్లు మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందేన‌ట‌.

భార‌త్‌ను ఈ కేటగిరీలో చేర్చేందుకు గ‌ల కార‌ణాల‌ను కాస్తంత విడ‌మ‌రిచి చెప్పిన అమెరికా ట్రావెల్ అడ్వైజ‌రీ... భార‌త్‌లో అత్యాచారాలు, ప్ర‌త్యేకించి ప‌ర్యాట‌క ప్రాంతాల్లో జ‌రుగుతున్న రేప్‌ లు - మ‌రీ ప్ర‌త్యేకంగా విదేశీ మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది. భార‌త్‌లో ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ జ‌రుగుతున్న రేప్‌ ల నేప‌థ్యంలో ఆ దేశానికి వెళ్లాల‌నుకునే వారు మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించింది. భార‌త్‌ లో పేట్రేగిపోతున్న ఉగ్ర‌వాదాన్ని కూడా ఆ అడ్వైజ‌రీ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది. అంతేకాకుండా ల‌డ‌క్‌ - లేహ్ మిన‌హా జ‌మ్మూ కాశ్మీర్‌ లోని ఏ ఒక్క ప్రాంతానికి కూడా వెళ్ల‌రాద‌ని అమెరికా త‌న పౌరుల‌కు సూచించింది. ఈ అడ్వైజ‌రీలో భార‌త్‌ ను లెవెల్ 2లో పెట్టిన అమెరికా... పాకిస్థాన్‌ ను మాత్రం లెవెల్ 3 జాబితాలో పెట్టేసింది. అంటే పాక్ వెళ్లానుకునే వారు మ‌రోమారు త‌మ ప‌ర్య‌ట‌న‌ల‌ను పునఃప‌రిశీలించుకోవాల‌న్న మాట‌.