Begin typing your search above and press return to search.

లాడెన్ కొడుకును అమెరికా ఏసేసిందా?

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:44 AM GMT
లాడెన్ కొడుకును అమెరికా ఏసేసిందా?
X
తన ఉగ్ర కార్యకలాపాలతో ప్రపంచానికే పెద్దన్నలాంటి అమెరికాకు కంటి నిండా కనుకు లేకుండా చేసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను వెతికి మరీ చంపేసిన తీరు ఎవరూ మర్చిపోలేరు. అమెరికా చరిత్రలో లాడెన్ కొట్టిన దెబ్బ వ్యక్తిగతంగానూ.. సంస్థ పరంగా ఎవరూ ఎప్పుడూ చేయనిది. అందుకే.. ప్రపంచానికే పాఠం చెప్పేలా లాడెన్ ను హతమార్చేందుకు భారీ వ్యూహాన్ని అమలు చేయటం తెలిసిందే.

లాడెన్ అంతంతో విశ్రమించని అమెరికా.. ఆయన ఉగ్ర వారసుడైన పదిహేనో కుమారుడు హమ్జా బిన్ లాడెన్ ను తాజాగా హతమార్చినట్లుగా చెబుతున్నారు. హమ్జాను అల్ ఖైదాకు లాడెన్ వారసుడిగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. లాడెన్ కొడుకును అమెరికా మట్టుబెట్టినట్లుగా విశ్వసనీయ సమాచారం తమ వద్ద ఉందని అమెరికాకు చెందిన ఎన్ బీసీ మీడియా సంస్థ పేర్కొనటం సంచలనంగా మారింది. తాము వెల్లడించిన సమాచారాన్ని కొందరు అమెరికన్ భద్రతాధికారులు తమ వద్ద ప్రైవేటుగా ధ్రువీకరించినట్లుగా పేర్కొంది.

లాడెన్ వారసుడ్ని గుర్తించి.. హతమార్చేందుకు అమెరికా గడిచిన రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అతడి కోసం భారీగా జల్లెడ పడుతోంది కూడా. అంతేకాదు.. 2017లో హమ్జాను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా.. అతడి తల పైన మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది కూడా. లాడెన్ 20 మంది సంతానంలో హమ్జా పదిహేనోవాడు. లాడెన్ వారసుడ్ని అగ్రరాజ్యం ఏసేసిందన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. భిమ్జా లాడెన్ మరణంపై అమెరికన్ అధికారులు కానీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఇప్పటివరకూ కన్ఫర్మ్ చేయలేదు.