Begin typing your search above and press return to search.

క్షిప‌ణిని గాల్లో పేల్చేసి స‌త్తా చూపిన అమెరికా

By:  Tupaki Desk   |   31 May 2017 8:14 AM GMT
క్షిప‌ణిని గాల్లో పేల్చేసి స‌త్తా చూపిన అమెరికా
X
అదే ప‌నిగా రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్న ఉత్త‌ర‌కొరియా తీరుకు అమెరికా అలెర్ట్ అవుతోంది. పిచ్చోడి చేతిలో రాయిలా మారిన ఉత్త‌ర కొరియా అణ్వ‌స్త్రాలు ఏ రోజైనా త‌మ మీద ప్ర‌యోగిస్తే.. వాటిని అడ్డుకోవ‌టానికి.. వాటిని మ‌ధ్య‌లోనే పేల్చేయ‌టానికి వీలుగా ప‌రీక్ష‌ల్ని షురూ చేసింది.

ఉత్త‌ర‌కొరియా చ‌ర్య‌ల‌కు ప్ర‌తి చ‌ర్య‌గా తాజా ప్ర‌య‌త్నాల్ని అభివ‌ర్ణించొచ్చు. త‌న‌కున్న క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌తో.. ఒక డ‌మ్మీ ఖండాంత‌ర క్షిప‌ణిని ప్ర‌యోగించిన అమెరికా.. మ‌రో క్షిప‌ణితో వాటిని కూల్చి వేస్తూ ప‌రీక్ష నిర్వ‌హించింది. ఈ చ‌ర్య ద్వారా.. త‌న‌కున్న క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌ద‌ర్శించ‌టంతో పాటు.. త‌మ ద‌గ్గ‌ర ఉత్త‌ర కొరియా ఆట‌లు సాగ‌వ‌న్న విష‌యాన్ని ప‌రోక్షంగా స్ప‌ష్టం చేసిన‌ట్లైంది.

మార్ష్ హాల్ ద్వీపంలోని రోనాల్డ్ రీగ‌న్ బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్ సెంట‌ర్ నుంచి ఒక ఖండాంత‌ర క్షిప‌ణిని ప్ర‌యోగించారు. అదే స‌మ‌యంలో దాన్ని ఛేదించేందుకు కాలిఫోర్నియాలోని వెండెన్ బ‌ర్గ్ ఎయిర్ ఫోర్స్ స్థావ‌రం నుంచి ది గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ నుంచి కిల్ వెహికల్ గా పిలిచే ఐదు అడుగుల క్షిప‌ణిని ప్ర‌యోగించారు. ఇది నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ప‌క్కాగా ఛేదించిన‌ట్లుగా నావికాద‌ళ వైస్ అడ్మిర‌ల్ జిమ్ సైరింగ్ వెల్ల‌డించారు.

వాస్త‌వానికి ఈ ప‌రీక్ష‌ను గ‌తంలోనే చేయాల్సి ఉన్నా.. అప్ప‌డు చేయ‌లేద‌ని.. ప్ర‌భుత్వం మ‌రిన్ని ప్ర‌మాణాలు నిర్దేశించ‌టంతో వాటిని అందుకోవ‌టానికి కాస్త ఆల‌స్య‌మైంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం. ఏమైనా.. ఉత్త‌ర కొరియా రెచ్చగొడుతూ త‌న ఆయుధ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న వేళ‌.. తానేమీ త‌క్కువ కాద‌ని.. ఉత్త‌ర కొరియాతో పోలిస్తే ప‌ది ఆకులు ఎక్కువే చ‌దవ‌ల‌గ‌ల‌న‌న్న విష‌యాన్ని అమెరికా త‌న తాజా ప‌రీక్ష‌తో స్ప‌ష్టం చేసింద‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/