Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం: అగ్గి పుట్టించింది మ‌నోడే!

By:  Tupaki Desk   |   23 July 2018 4:58 AM GMT
సంచ‌ల‌నం: అగ్గి పుట్టించింది మ‌నోడే!
X
కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. పెద్ద ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికింది. ఇప్ప‌టివ‌ర‌కూ అనుకున్న‌ది త‌ప్ప‌ని తేల‌ట‌మే కాదు.. ఆధారాలు ల‌భించిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దేశంలో మ‌ధ్య శిలాయుగంలో నిప్పు పుట్టించిన ఆదిమ మాన‌వుడు తెలుగు ప్రాంతానికి చెందినోడ‌ని.. అందునా తెలంగాణ వ్య‌క్త‌న్న విష‌యం తాజా ప‌రిశోధ‌న‌ల్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మనిషి ప‌రిణామ క్ర‌మంలో అత్యంత కీల‌క‌మైంది నిప్పు రాజేయ‌టం. అదే.. మ‌నిషి జీవ‌న గ‌తిని మొత్తంగా మార్చ‌ట‌మే కాదు.. ఆధునిక యుగంలోకి అడుగు పెట్టేలా చేసింది. అయితే.. ఆదిమ మాన‌వుడు నిప్పు ఎక్క‌డ పుట్టించాడ‌న్న‌ది తేల్చేందుకు కొన్నేళ్లుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో నిప్పు పుట్టించార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. కానీ.. ఆధారాల్లేవు. తాజాగా జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ఉట్నూరులో బ‌య‌ట‌ప‌డిన బూడిద రాశుల అవ‌శేషాల‌ను ప‌రిశోధించిన బ్రిటిష్ మ్యూజియం ప‌రిశోధ‌క బృందం కొత్త విష‌యాన్ని క‌నుగొంది. బృహ‌త్ శిలాయుగం నాటి తొలినాళ్ల‌లోనే నిప్పును రాజేసింది ఇక్క‌డేన‌ని తేల్చింది. అంత‌కు ముందే మాన‌వ సంచారం ఉంద‌ని.. బ‌హుశా మ‌ధ్య‌రాతి యుగంలోనే నిప్పు పుట్ట‌టానికి అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాకు వ‌చ్చింది.

పాత‌రాతి యుగంలో మాన‌వుడు ప‌చ్చి మాంసం తినేవాడ‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. జంతువుల చ‌ర్మాల‌ను శ‌రీరానికి క‌ప్పుకునేవాడు. అగ్గి పుట్టిన త‌ర్వాతే మాన‌వ జీవితంలో మార్పు మొద‌లైంది. ఆధునిక జీవ‌నం దిశ‌గా అడుగులు ప‌డ్డాయి. అయితే.. నిప్పు రాజేసిన మాన‌వ జాతి స‌మూహం మీద ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నారు ఇంగ్లండ్‌ కు చెందిన ప‌రిశోధ‌కుడు రాబ‌ర్ట్ బ్రూస్ ఫూట్‌.

ఆయ‌న జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఉట్నూరులో ఆయ‌న కొన్ని తవ్వ‌కాలు జ‌రిపారు. ఇందులో భాగంగా ఆయ‌న కొన్ని బూడిద స‌మూహాల్ని గుర్తించారు. అవ‌న్నీ పేడ పిడ‌క‌ల బూడిద‌గా గుర్తించారు. ఇవి వేస‌విలో రాపిడికి గురై అంటుకొని బూడిద‌గా మారాయ‌ని గుర్తించారు. ఇక్క‌డి బూడిద‌ను కొంత సేక‌రించిన ఆయ‌న‌.. ఇంగ్లండ్‌ కు తీసుకెళ్లి బ్రిటిష్ మ్యూజియం ఆర్థిక సాయంతో బూడిద ర‌సాయ‌న విశ్లేష‌ణ‌లో జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో ఈ కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దేశం మొత్త‌మ్మీదా నిప్పును గుర్తించి.. దాన్ని రాజేసిన ఆన‌వాళ్లు ఉట్నూరులోనే క‌నుగొన్న వైనాన్ని బ్రూస్ ఫూట్ అధికారికంగా వెల్ల‌డించారు. దేశం మొత్త‌మ్మీదా నిప్పు రాజేసిన తొలి ఘ‌న‌త తెలుగు స‌మూహానికి ద‌క్క‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.