Begin typing your search above and press return to search.

పంజాబ్ బ్యాంక్ స్కాం ఆమెకు ముందే తెలుస‌ట‌!

By:  Tupaki Desk   |   22 May 2018 4:05 AM GMT
పంజాబ్ బ్యాంక్ స్కాం ఆమెకు ముందే తెలుస‌ట‌!
X
దేశాన్ని షాక్ కు గురి చేసిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుంభ‌కోణంలో కొత్త పాత్ర‌ల్ని తెర‌పైకి తీసుకొచ్చింది సీబీఐ. ఆ బ్యాంకు సీఈవో క‌మ్ ఎండీ ఉషా అనంత సుబ్ర‌మ‌ణియ‌న్ కు స్కాం గురించిన వివ‌రాలు ముందే తెలుస‌న్న విష‌యాన్ని త‌న ఛార్జ్ షీట్లో పేర్కొంది. కావాల‌నే ఆర్ బీఐను ప‌క్క‌దారి ప‌ట్టించిన‌ట్లుగా తేల్చారు. బ్యాంకును త‌ప్పుడు దారిలో న‌డిచేలా చేసి రూ.13వేల కోట్ల భారీ మొత్తం ప‌క్క‌దారి ప‌ట్ట‌టానికి ఆమె కూడా కార‌ణంగా చెబుతున్నారు.

తాజాగా కోర్టులో దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్లో ఆస‌క్తిక‌ర అంశాల్ని పేర్కొన్నారు. 1200 పేజీలున్న ఈ చార్జ్ షీట్లో నీర‌వ్ మోడీ చేసిన త‌ప్పుడు ప‌నుల్ని వివ‌రంగా వెల్ల‌డించింది. దీంతో న్యాయ‌స్థానం నీర‌వ్ మోడీ.. నిషాల్‌.. నీర‌వ్ గ్రూప్‌న‌కు చెందిన సుభాష్ ప‌ర‌బ్ ల‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ల‌ను జారీ చేసింది. అదే స‌మ‌యంలో ఈ కుంభ‌కోణంలో బ్యాంకు కీల‌క స్థానంలో ఉన్న ఉషా అనంత సుబ్ర‌మ‌ణియ‌న్ ల‌తో స‌హా ప‌లువురు బ్యాంక్ అధికారుల‌కు దుబాయ్.. ఇండియ‌న్ ఓవ‌ర్ సీస్ బ్యాంక్ అధికారుల‌కు బ్యాంకులో జ‌రుగుతున్న మోసం తెలుస‌ని తేల్చారు. అయితే.. ఏమీ తెలియ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి కుంభ‌కోణం సాగిపోవ‌టానికి త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించిన‌ట్లుగా పేర్కొంది.

నీర‌వ్ చేసే త‌ప్పుడు ప‌నుల గురించి పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ఎండీకి అన్ని తెలుస‌ని చెప్ప‌టానికి కొన్ని ఆధారాల్ని కోర్టుకు పేర్కొన్నారు. నీర‌వ్ మోడీ గ్రూప్ న‌కు చెందిన సీనియ‌ర్ అధికారి విపుల్ అంబానీ త‌ర‌చూ ఉషా భేటీ అయ్యే వార‌ని.. మాట్లాడుకునే వార‌ని వెల్ల‌డించారు. ఆమెకు అన్ని తెలుసు అన‌టానికి ఇంత‌కు మించిన ఆధారం అక్క‌ర్లేద‌ని చెబుతున్నారు. నీర‌వ్ మోడీ కుంభ‌కోణంలో ఉషా స‌హ‌కారం కీల‌కంగా భావిస్తున్నారు.