Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ కు రేవంత్‌ రెడ్డి స‌హ‌క‌రిస్తాడా..!

By:  Tupaki Desk   |   25 Sep 2019 8:18 AM GMT
ఉత్త‌మ్‌ కు రేవంత్‌ రెడ్డి స‌హ‌క‌రిస్తాడా..!
X
హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌ధాన పార్టీల‌న్నింటికీ ఈ ఉప ఎన్నిక అగ్ని ప‌రీక్ష‌గా మారింది. దీంతో అధికార టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. హుజూర్‌ న‌గ‌ర్‌ లో గులాబీ జెండా ఎగ‌ర‌వేయ‌డం ద్వారా ప్ర‌జామోదం త‌మ‌కు ఉంద‌ని చెప్పుకోవ‌డంతోపాటు - త‌మ పాల‌న‌పై విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌న్నింటికీ చెక్ పెట్టాల‌ని టీఆర్ ఎస్ యోచిస్తోంది.

మ‌రోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డం ద్వారా తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌ కు తామే ప్ర‌త్యాయ్నాయం అనే సంకేతాలివ్వ‌డంతో పాటు - రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌నుకుంటున్న బీజేపీని వెన‌క్కి నెట్టాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆటు టీఆర్ ఎస్‌ - ఇటు కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. అయితే అంద‌రి కంటే ముందే టీఆర్ ఎస్ త‌న అభ్య‌ర్థిగా సైదిరెడ్డిని ప్ర‌క‌టించి - ప్ర‌చారంలో దూసుకుపోతోంది. అంతేగాక హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక ఇన్‌ చార్జిగా త‌న స‌న్నిహితుడు - ఎమ్మె ల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డిని నియ‌మించి పార్టీ గెలుపు బాధ్య‌త‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణ‌లో ప‌లు ఉప ఎన్నిక‌ల‌తో పాటు చాలా ఎన్నిక‌ల్లో ఇన్‌ చార్జ్‌ గా పార్టీని గెలిపించి ట్ర‌బుల్ షూట‌ర్ ముద్ర వేయించుకున్న హ‌రీష్‌ రావును కాద‌ని.. ప‌ల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఇక కాంగ్రెస్‌ కు కంచుకోట‌గా ఉన్న హుజూర్‌ న‌గ‌ర్‌ లో ఇంటిపోరు పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తికి రెడ్డికి టికెట్ ద‌క్కిన‌ప్ప‌టికీ... నియోజ‌క‌వ‌ర్గంలోని అస‌మ్మ‌తి నేత‌లు స‌హ‌క‌రిస్తారా ? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

ముఖ్యంగా టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్‌ రెడ్డి ... ఉత్త‌మ్‌ కు స‌హ‌క‌రిస్తాడా..లేదా.. అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. త‌న అనుచ‌రుడు చామ‌ల కిర‌ణ్‌ రెడ్డికి హుజూర్‌ న‌గ‌ర్ టికెట్ కోసం రేవంత్ తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయితే అదిష్టానం రేవంత్‌ కు మొండి చేయి చూపి - ప‌ద్మావ‌తిరెడ్డికి టికెట్ కేటాయించింది. ఈప‌రిస్థితుల్లో రేవంత్‌ రెడ్డి పార్టీ గెలుపున‌కు కృషి చేస్తారా.. . పార్టీలోని అస‌మ్మ‌తి వ‌ర్గం ప‌ద్మావ‌తి రెడ్డికి మ‌ద్ద‌తు ప‌లుకుతుందా లేదా ? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

రేవంత్ టీడీపీలో ఉన్న‌ప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు కొంత అనుచ‌ర‌గ‌ణం ఉంది. ఆంధ్రాకు స‌రిహ‌ద్దుగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని అభిమానించే క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు కూడా ఉంది. ఇప్పుడు వీరంతా ఎటు వైపు మొగ్గు చూపుతారు ? రేవంత్ ఏం చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.