Begin typing your search above and press return to search.

ఉత్తమ్, షబ్బీర్ ను ఓవైసీబ్యాచ్ ఎలాకొట్టిందంటే?

By:  Tupaki Desk   |   3 Feb 2016 5:05 AM GMT
ఉత్తమ్, షబ్బీర్ ను ఓవైసీబ్యాచ్ ఎలాకొట్టిందంటే?
X
రెండు రాజకీయ పార్టీల మధ్య తగులాట మామూలే. ఆ మాటకు వస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగటం చూశాం. కానీ.. ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర రథసారధిపై మరో రాజకీయ పార్టీ అధినేత కారులో నుంచి బయటకు లాగి కొట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉంటూ.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం మాట్లాడుకోవటం లాంటి స్నేహాన్ని మరిచి మరీ కొట్టటం ఎంత దుర్మార్గం? ఇప్పుడు అలాంటి దుర్మార్గమే హైదరాబాద్ పాతబస్తీలో మంగళవారం చోటు చేసుకుంది.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్.. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. నేతలు చేసిన ఆరాచకానికి మిగిలిన రాజకీయ పార్టీలు మాన్పడిపోయిన పరిస్థితి. మరి ముఖ్యంగా ఉత్తమ్.. షబ్బీర్ ల మీద జరిగిన దాడిని చూస్తే నిజంగా షాకింగ్ గా టుంది.

మొదట ఉత్తమ్ మీద అసదుద్దీన్ దాడి చేసిన ఘటనలోకి వెళితే..

మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పురానాపూల్ డివిజన్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రీ.. కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి గౌస్ అనుచరులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ గురించి కాస్త చెప్పాలి. ఇతగాడు మజ్లిస్ పార్టీకే చెందినవాడు. తాజా ఎన్నికల్లో మజ్లిస్ తరఫు టిక్కెట్టు కోసం ప్రయత్నించి విఫలం చెందాడు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇతడు కాంగ్రెస్ లో చేరటం.. ఆయనకు పార్టీ టిక్కెట్టు ఇవ్వటంతో మజ్లిస్ రగిలిపోయింది.

తాను పోటీ చేస్తున్న డివిజన్ పై మంచి పట్టు ఉన్న గౌస్ ను నిలువరించేందుకు మజ్లిస్ ఎమ్మెల్యే బలాల స్వయంగా రంగంలోకి దిగారు. గౌస్ అనుచరులపై ఎమ్మెల్యే పాషాఖాద్రీ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి జరగటం.. అనంతరం పోలీసులు ఇరు వర్గాల్నిస్టేషన్ కు తరలించారు. గొడవ ముదరకుండా ఉండేందుకు పాషాఖాద్రీని చార్మినార్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తే.. గౌస్ ను మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.

మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కువచ్చి అధికారులతో మాట్లాడి.. బరిలో ఉన్న అభ్యర్థిని ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించి.. ఎన్నికల అధికారితో మాట్లాడారు. దీంతో.. గౌస్ ను విడుదల చేయాలని ఎన్నికల సంఘం అధికారులు పోలీసులకు చెప్పటంతో ఆయన్ను విడిచి పెట్టారు. ఆయన్ను తీసుకొని బయటకు వచ్చిన ఉత్తమ్ మీడియాతో మాట్లాడి కారులో వెళ్లబోతున్నారు.

అప్పుడు చార్మినార్ వైపు నుంచి బైకు మీద మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన అనుచరులు వందలాదిగా బైకుల మీద వచ్చారు. ఉత్తమ్ వాహనాన్ని చూసినంతనే.. చేతులతో ఆపారు. అసద్ వెంట వచ్చిన కార్యకర్తలు ఉత్తమ్కారు అద్దాల్ని ధ్వంసం చేశారు. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ఆవేశంతో ఊగిపోతూ ఉత్తమ్ కారు బాయినెట్ మీద చేతులతో గుద్దారు. అక్కడితో ఆగితే ఫర్లేదు. కానీ.. హద్దులు దాటిన అసద్.. ఉత్తమ్ కారు వద్దకు వచ్చి.. డోర్ తీసి ఉత్తమ్ ను బయటకు లాగారు. ఇక్కడకు ఎందుకొచ్చావ్ అంటూ ప్రశ్నించారు. ఇలాంటివేమీ ఊహించని ఉత్తమ్ షాక్ తిన్న పరిస్థితి. ఆయన రియాక్ట్ అయ్యే సమయానికే అసద్ చేయి బలంగా విసిరారు. దీంతో ఆయన తప్పుకునే ప్రయత్నం చేసినా.. అసద్ చేయి ఉత్తమ్ ముఖంపై తగిలింది. ఆ రీతిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారధిపై మజ్లిస్ అధినేత చేయి చేసుకున్నారు.

షబ్బీర్ పైనా పిడిగుద్దులు

ఒకవైపు ఉత్తమ్ మీద అసదుద్దీన్ ఓవైసీ దాడి చేస్తే.. మరోవైపు ఉత్తమ్ వెంట ఉన్న షబ్బీర్ అలీని చూసిన మజ్లిస్ కార్యకర్తలు చెలరేగిపోయారు. కారు తలుపు తీసిన మజ్లిస్ కార్యకర్తలు ఆయన్ను కారులో నుంచి దించి.. కడుపులోనూ.. ముఖం మీదా పిడిగుద్దులు గుద్దారు. ఇంత జరుగుతున్నా.. ఉత్తమ్.. షబ్బీర్ అలీ సెక్యూరిటీ చూస్తూ ఉండిపోవటం గమనార్హం. చేతుల్లో గన్స్ పట్టుకొని ఉన్నా.. తాము రక్షించాల్సిన నేతలపై విచక్షణారహితంగా దాడి జరుగుతున్నా.. ప్రేక్షక పాత్ర పోషించిన దుస్థితి. కాసేపటికి పోలీసు బలగాలు వచ్చి.. మజ్లిస్ మూక నుంచి ఉత్తమ్.. షబ్బీర్ లను తప్పించి బయటకు పంపగా.. వారు గాంధీ భవన్ కు చేరుకొన్నారు.

ఇదిలా ఉంటే.. షబ్బీర్ మీద దాడి చేసిన మజ్లిస్ కార్యకర్తల్నిపోలీసులు అదుపలోకి తీసుకున్నారు. ఇది చూసిన మజ్లిస్ మూక మరింత రెచ్చిపోయింది. ‘‘భాగో.. భాగో’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. పోలీస్ స్టేషన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో.. వెనక్కి తగ్గిన పోలీసు అధికారులు షబ్బీర్ మీద దాడి చేసిన వారిని వదిలేస్తామని చెప్పటంతో మజ్లిస్ కార్యకర్తలు శాంతించారు. వారిని అప్పటికప్పుడు విడిచి పెట్టటంతో విజయగర్వంతో కేకలు వేసుకుంటూ వెళ్లిపోయారు. అక్కడి నుంచి వెళ్లాలని.. శాంతిభద్రతలు క్షీణిస్తాయని చెప్పటంతో అసదుద్దీన్ వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారధిపై భౌతికదాడి చేసిన తర్వాత కూడా అసదుద్దీన్ ఓవైసీ ఠీవీగా వెళ్లిపోయారే తప్పించి.. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.