Begin typing your search above and press return to search.

అన్నీ ఇచ్చేస్తాం... గెలిపించండి ప్లీజ్..

By:  Tupaki Desk   |   4 Sep 2018 5:48 AM GMT
అన్నీ ఇచ్చేస్తాం... గెలిపించండి ప్లీజ్..
X
ఎలాగైనా విజయం సాధించాలి. ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఎలాగైనా కల్వకుంట్ల వారిని గద్దె దించాలి. ఇది కాంగ్రెస్ తెలంగాణ నాయకుల ఆలోచన. ఇదే వారి ఏకైక లక్ష్యం. ఇదే వారి ఏకైక నినాదం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరిని కదిపినా ఇదే మాట్లాడుతున్నారు. ఇదే చర్చించుకుంటున్నారు. విజయం సాధించేందుకు ఎలాంటి కార్యక్రమాలనైనా చేపట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అధికారం ఇవ్వండి.... మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తాం అనే ఏకైక తీర్మానంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అధిష్టానాన్ని సంప్రదించి చేసే సంప్రదాయం ఉంది. అయితే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైనప్పటి నుంచి కీల‌క నిర్ణయాలు తప్ప మిగిలిన అంశాలను స్ధానికంగా చూసుకోవాలని ఆయన పార్టీ వర్గీయులకు చెప్పినట్లు సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సాధ్యాసాధ్యాలను కూడా బేరీజు వేసుకోకుండా వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మానిఫెస్టో రూపకల్పనపై కూడా పార్టీలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. ఇక తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు - ప్రయివేట్ రంగంలో మరో లక్ష ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో 19 లక్షల మంది నిరుద్యోగులున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయని, ఇది తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతోందని అంటున్నారు. ఉద్యోగాల కల్పనే కాకుండా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలంగాణ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోగా తన ఇంటిలో నాలుగు ఉద్యోగాలు వచ్చేలా చేసుకున్నారని, ఇదే అంశాన్ని పెద్ద‌గా ప్రచారం చేయాలన్నది కాంగ్రెస్ నాయకుల ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తానికి సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా ముందుగా ఎన్నికల హామీలు గుప్పించి ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎత్తుగడలా కనిపిస్తోంది. ప్రగతి నివేదన సభ అధికార పార్టీ ఆశించిన స్ధాయిలో జరగలేదన్నది కాంగ్రెస్ నాయకుల భావన. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.